12 August, 2026 | 2:38 PM

అమ్మవారిని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే

12-08-2026 01:15 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చంద్రాపూర్ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రాపూర్ మహంకాళి ఆలయం గోండ్ రాజుల కాలం నాటి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిందనీ, ఈ ఆలయ చరిత్ర చంద్రాపూర్ గోండ్ రాజవంశంతో ముడిపడి ఉందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ గెజిటియర్ ప్రకారం ఆలయాన్ని రాణి హీరాయ్ పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయనీ, శతాబ్దాల చరిత్రను, గోండ్ రాజుల వారసత్వాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ మహంకాళి ఆలయం నేటికీ మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల భక్తులకు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.