సిమెంట్ ఇటుకతో బాది.. భార్యను హత్య చేసిన భర్త
మద్యం మత్తులో భర్త ఘాతుకం
ఘట్ కేసర్ ద్వారక నగర్ లో దారుణం
ఘట్ కేసర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తాగుడుకు బానిసై అనుమానంతో కట్టుకున్న భార్యపై సిమెంట్ ఇటుతో దాడి చేసి హత్య చేసిన దారుణమైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా, కిలగనపర్ మండలం, సలకలపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ మాన్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అతని చెల్లెలు మాధవి (37) ని 18 సంవత్సరాల క్రితం కాట్రావత్ రాజు (44) కి ఇచ్చి వివాహం జరిపించారు. వీరు గత 15 సంవత్సరాలుగా ఘట్కేసర్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత మూడు సంవత్సరా లుగా రాజు మద్యానికి బానిసై, భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తరచుగా శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. పెద్దమనుషుల సమ క్షంలో పంచాయితీలు నిర్వహించి నచ్చజెప్పినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రాజు మద్యం మత్తులో ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులందరూ నిద్రపోయిన తర్వాత పథకం ప్రకారం భార్య మాధవిని చంపాలనే ఉద్దేశంతో ఆమె ఛాతీపై పెద్ద సిమెంట్ ఇటుకతో ఎత్తివేసి కొట్టాడు. చాతి పై గాయంతో మాధవి స్పృహ కోల్పోగా కుటుంబ సభ్యులు, పొరుగువారు వెంటనే 108 అంబులెన్స్‌లో ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డ్యూటీ డాక్టర్ అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. కాట్రావత్ రాజుపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.






