14-02-2026 12:11:43 AM
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోచరిత్ర
౨౯7 స్థానాల్లో బీఎన్పీ ౨౧౨ స్థానాలు కైవసం
మ్యాజిక్ ఫిగర్ ౧౫౧ కాగా, సునాయాసంగా ఆ మార్క్ దాటేసిన బీఎన్పీ
ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న పార్టీ నేత తారిఖ్ రెహమాన్
కేవలం ౭౭ స్థానాలకు పరిమితమైన జమాత్ ఏ ఇస్లాం
ఆరు స్థానాల్లో జెన్‌జీ సారథుల పార్టీ (ఎన్సీపీ) విజయ బావుటా
మిగిలిన ౨ చోట్ల స్వతంత్ర అభ్యర్థుల విజయం
ఢాకా, ఫిబ్రవరి ౧౩: బంగ్లాదేశ్ ౧౩వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. 297 స్థానాల్లో ఏకంగా ౨౧౨ స్థానాలను కైవ సం చేసుకుంది. పాతికేళ్ల పాటు నుంచి అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది. దేశాధినేతగా ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ పగ్గాలు చేపట్టనున్నారు. 1991 తర్వాత పగ్గాలు చేపడుతున్న పురుష ప్రధానిగా ఆయన కొత్త రికార్డు నెలకొల్పనున్నారు.
దేశవ్యాప్తంగా 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా, వాటిలో ఒక స్థానంలో అభ్యర్థి మరణం వల్ల అక్కడ ఎన్నికల జరగలేదు. అలాగే.. న్యాయపరమైన చిక్కుల కారణంగా రెండు స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడలేదు. మిగిలిన 297 స్థానాల్లో, బీఎన్పీ ఏకం గా 212 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ ౧౫౧ కాగా, బీఎన్పీ ఆ మార్క్‌ను సునాయాసంగా దాటేసింది.
పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతానని ఎన్నికల ముందు ధీమా వ్యక్తం చేసిన జమాత్ -ఏ -ఇస్లామీ మాత్రం.. కేవలం 77 స్థానాలకు పరిమితమైంది. అలాగే జెన్‌జీ సారథుల పార్టీగా పేరున్న నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) ఆరు స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది.
మిగిలిన ౨ స్థానాల్లో ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో అవామీ లీగ్ పార్టీ లేకుండా జరిగిన ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. సుమారు 18 నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరితే ఇక ఆ దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శకం ఆరంభం కానుంది.
జూలై చార్టెర్‌కు ౭౨.౯% మద్దతు
బంగ్లా తాత్కాతిక ప్రభుత్వం ఎన్నికలతోపాటు ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం) కూడా చేపట్టింది. ఈ రెఫరెండంలో అత్యధికశాతం మంది ప్రజలు దేశ రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నట్లు తేలింది. రాజ్యాంగ సంస్కరణల కోసం ప్రతిపాదించిన ‘జూలై చార్టర్’కు సుమారు 72.9 శాతం మంది మద్దతు పలికారు. 2024 ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో ఈ సంస్కరణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాల్లో- కొత్త మలుపు
బంగ్లాదేశ్‌లో బీఎన్పీ గెలుపు భారత్ బంగ్లా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మలుపుతిప్పుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన నాయకత్వం లో జమాత్- -ఇస్లామీ వంటి తీవ్రవాద శక్తుల ప్రభావం తగ్గితే, అది భారత్ భద్రతకూ మేలు చేస్తుందని భావిస్తున్నారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే తారిఖ్ రెహమాన్ సంకేతాలిచ్చారు.
అలాగే ఆ బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై తారిఖ్ స్పందిస్తూ.. మైనార్టీ వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే తీస్తా జలాల పంపిణీ, సరిహద్దు భద్రత వంటి అంశాలపై తారిఖ్ ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడం, ఆమెను అప్పగించాలనే బంగ్లా డిమాండ్ వంటి అంశాలు ద్వైపాక్షిక సంబంధాలకు కొంత ఇబ్బందికరంగామారే అవకాశం ఉంది.
బంగ్లాకు భారత్ సంపూర్ణ మద్దతు: ప్రధాని మోదీ
బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ తాత్కాలిక అధినేత తారిఖ్ రెహమాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఈ మేరకు తారిఖ్ రెహమాన్‌లో ఫోన్‌లో సంభాషించారు. బంగ్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో తారిఖ్‌కు భారత్ నుంచి సంపూర్ణ మ ద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
రెండు దేశాల మధ్య చారిత్రక, సాం స్కృతిక సంబంధాలు బలంగా ఉన్నాయని, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల సా ధన కోసం కలిసి పనిచేయాల్సి ఉం టుందని తారిఖ్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. బంగ్లాలో బీఎన్పీ గెలుపు రెండు దేశాల మధ్య మెరుగైన ద్విపాక్షిక సంబంధాలకు దారితీస్తుందని ఆకాంక్షించారు.
జమాత్ ఏ ఇస్లామీకి పరిమితమైన స్థానాలు
బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల్లో జమాత్ ఏ ఇస్లామీ కింగ్ మేకర్‌గా మారుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఆ పార్టీ పరిమితమైన స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ మరో 11 పార్టీల కలిసి కూటమిగా బరిలోకి దిగింది. మొత్తంగా 76 స్థానాలను మాత్రమే సాధించగలిగింది. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే, ఆ పార్టీకి మెరుగైన ఫలితమే అయినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలన్న వారి ఆశలు మాత్రం నెరవేరలేదు. జమాత్ ఏ ఇస్లామీ పార్టీకి మొదటి నుంచి వివాదాస్పద చరిత్రే ఉంది.
ఆ పార్టీ అనాది నుంచీ పాకిస్థాన్‌కు అనుకూలమైన వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నది. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో నూ పార్టీ బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించింది. పాకిస్థాన్ విభజనను ఇస్లామిక్ ఐక్యతకు విఘాతమని కూడా అభివర్ణించింది. నాటి స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులపై జరిగిన దాడుల్లో ఈ పార్టీకి చెందిన వారి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
బంగ్లా ఆవిర్భావం తర్వాత, అప్పటి ప్రభుత్వం ఈ పార్టీని నిషేధించింది. తర్వాత కొంతకాలానికి నిషేధం ఎత్తివేయడంతో జమాత్ ఏ ఇస్లామీ మళ్లీ తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత కూడా ఆ పార్టీ పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపింది. కొన్ని అభియోగాల నేపథ్యంలో ఆ పార్టీ సభ్యత్వాన్ని 2013లో అక్కడి న్యాయస్థానం రద్దు చేసింది. అప్పటి నుంచి ఆటుపోట్లను ఎదుర్కొన్న పార్టీ.. 2024 ఆగస్టులో షేక్ హసీనా సంక్షోభం తర్వాత మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చింది.
చురుకైన నేత తారిఖ్
బీఎన్పీ నేత తారిఖ్ రెహమాన్‌కు చిన్ననాటి నుంచి రాజకీయాల్లో ప్రవేశం ఉంది. ఆయన తండ్రి జియావుర్ రెహమాన్, తల్లి ఖలీదా జియా ఇద్దరూ దేశాధినేతలుగా సేవలందించారు.తారిఖ్ చిన్న వయస్సు నుంచే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1981లో తండ్రి హత్యకు గురైన తర్వాత తల్లి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 1991లో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు బీఎన్పీ అధినేత్రిగా దేశ రాజకీయాలను శాసించారు. తారిఖ్‌పై తల్లి ప్రభావం ఎంతగానో ఉంది.
2002లో ఆయన పార్టీ జాయింట్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో యువజన విభాగాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత పదిహేనేళ్లుగా ఆయన లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. 2008లో వైద్య చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన ఆయన, స్వదేశంలో తనపై ఉన్న క్రిమినల్ కేసులు, బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితుల కారణంగా అక్కడే ఉండిపోయారు.
లండన్ నుంచే ఆయన పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వచ్చారు. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేస్తూ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేశారు. తల్లి గతేడాది డిసెంబర్ 30న కన్నుమూశారు. ఆ బాధలో ఉండి కూడా తారిఖ్ సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. సోషల్ మీడియాతోపాటు వర్చువల్ సమావేశాల నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
పార్టీ సుదీర్ఘకాలం పాటు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ దిటవు గుండెతో పార్టీని నిలబెట్టారు. ఒకప్పుడు ‘డార్క్ ప్రిన్స్’గా ముద్రపడిన తారిఖ్, ఇప్పుడు ఒక పరిణతి చెందిన నాయకుడిగా కనిపిస్తూ దేశ ప్రజల ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన, రాజకీయ సంక్షోభాల నుంచి గట్టెక్కించడమే తన ముందున్న లక్ష్యామని తారిఖ్ ప్రకటించారు. మరోవైపు ఆయన సత్వరం లండన్ నుంచి సొంత దేశానికి మాకాం మార్చే పనిలో పడ్డారు.