30 July, 2026 | 12:48 AM

తెల్లబెల్లం మాటున.. నల్లబెల్లం దందా..!

30-07-2026 12:00 AM
  1. బహిరంగంగా అక్రమ బెల్లం రవాణా 
  2. లారీల కొద్దీ దిగుమతులు!
  3. అలసత్వంలో అధికారులంటూ ఆరోపణలు 
  4. అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజల వేడుకోలు

మోతె, జూలై29 : తెల్ల బెల్లం రవాణాకు అనుమతులు తీసుకొని లారీలలో వెలుపలి వైపున తెల్లబెల్లం పెట్టీ దాని మధ్య నాటు సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం అక్రమంగా రవాణా చేస్తూ కొందరు ఆక్రమా ర్కులు దానిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇలా లోడలకొద్ది నల్ల బెల్ల మును రవాణా చేస్తూ లక్షల రూపాయ లు పోగేసుకుని సమాజంలో ధనవంతులుగా చలామణి అవుతున్నారు కొందరు అక్రమార్కులు. ఇదే తంతు ఇటీవల జిల్లాలోని మోతె మండలంలోనూ జరుగుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

 లారీల కొద్దీ అక్రమ సరఫరా: 

మండలంలో కొందరు నల్లబెల్లమును అక్రమంగా రవాణా చేస్తూ దానినే ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లారీల వెలుపల వైపు తెల్ల బెల్లాన్ని అమర్చి దాని మధ్యలో నల్ల బెల్లం పెట్టి ఎవరికి అనుమానం రాకుండా రవాణాను సజావుగా సాగిస్తున్నారనే చర్చ లు మండలంలోని పలు గ్రామాలలో సాగుతున్నాయి. లారీల కొద్దీ నల్ల బెల్లాన్ని బహి రంగంగా ఓ వ్యాపారి ఇంటి వద్ద దింపుతున్నా సంబంధిత అధికారులు చూసీచూ డనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మాయమైన పట్టుబడిన నల్లబెల్లం! 

మండలంలో గతంలో నాటు సారా తయారీదారులకు తరలిస్తున్న నల్ల బెల్లాన్ని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్న ఘటనలో స్వాధీ నం చేసుకున్న బెల్లం మాయమైందన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ తంతు బయటకు రాకుండా ఉండేందుకు మధ్యవర్తులు రూ.30 వేల రూపాయలు తీసుకున్నారనే ప్రచారం అప్పట్లో పెద్ద దుమారానికే దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ నల్లబెల్లం రవాణా చేసే అక్రమార్కులు వారితో చర్చలు జరుపుతూ తమ వ్యవహారాలను సజావుగా నిర్వహిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 అలసత్వంలో అధికారులు 

సారా విక్రయదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్న అధికారులు సారా తయారీకి మూలమైన నల్ల బెల్లం సరఫరాదారులపై మాత్రం అలసత్వం వయిస్తున్నా రని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. బెల్లం వ్యాపారులపై కట్టుదిట్టమైన నిఘా పెడితే గుడుంబా తయారీని గణనీయంగా అరికట్టవచ్చని స్థానికులు అభిప్రా యపడుతున్నారు.

రాత్రి వేళల్లో గ్రామాలకు నల్ల బెల్లం చేరుతుండటంతో నాటు సారా విరివిగా తయారవుతున్నట్లు తెలుస్తుంది. తక్కువ ధరలు, రవాణాపై పెద్దగా తనిఖీలు లేకపోవడం కూడా ఈ అక్రమ వ్యాపారానికి అనుకూలంగా మారిందనే విమర్శలు విలువెత్తుతున్నాయి. 

ఇప్పటికైనా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు అక్రమంగా సాగుతున్న నల్ల బెల్లం రవాణా పై దృష్టిని సారించి దానికి అడ్డుకట్ట వేసి నాటు సారు తయారీని అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

నల్ల బెల్లాన్ని సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

నల్ల బెల్లాన్ని సరఫరా చేసినా, కొనుగోలు చేసినా సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. అక్రమ వ్యాపారంపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

సురేందర్, ఎక్సైజ్ ఎస్‌ఐ