2 July, 2026 | 12:19 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ఎన్డీఏకు బ్లాక్ డే

19-04-2026 01:36 AM

ఇది ప్రజాస్వామిక విజయం

  1. దొడ్దిదారిన డీలిమిటేషన్ కుట్రను భగ్నం చేశాం 
  2. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౮: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామి క విజయమని, ఎన్డీయే కూటమికి బ్లాక్ డే అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అభివర్ణించారు. విపక్షాల ఐక్యతకు ఇదొక నిదర్శనమని హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్‌ను అమలుచేయాలని కేంద్రం కుట్ర పన్నిందని, ఆ కుట్రను ఇండియా కూటమి విజయవంతంగా భగ్నం చేసిందని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చామని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే ఎలాంటి కుట్రనైనా తాము ఉపేక్షించమని స్పష్టంచేశారు. కేంద్రంలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ భావిస్తున్నదని, కానీ.. కాంగ్రెస్ ఆ కలను సాకారం కానివ్వదని హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్రం సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన సాకుతో మహిళా కోటాను వాయిదా వేయాలని చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ బిల్లును తెరపైకి తెచ్చిందని విమర్శించారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

మహిళా కోటా బిల్లు ఆమోదం పొందితే తమ విజయంగా.. బిల్లు వీగిపోతే కాంగ్రెస్ పార్టీపై నెపం నెట్టాలని బీజేపీ నేతలు పథకం పన్నారని మండిపడ్డారు. కానీ, మహిళలకు బీజేపీ కుయ్తులన్నీ తెలుసునని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆమె ఉన్నావ్, హాథ్రస్ అత్యాచార ఘటనలు, మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలనూ ప్రస్తావించారు.

బీజేపీ నేతలు నాడు బాధితులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. అప్పుడు, నోరు మెదపకుండా ఇప్పుడు మహిళా రిజర్వేషన్లంటూ మొత్తుకుంటే, మహిళా లోకం చూస్తూ ఊరుకోదని చురకలంటించారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి మహిళలకు నిజంగా మేలు చేయాలని ఉంటే, 2023 మహిళా కోటా బిల్లునే అమలు చేయవచ్చు కదా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.