19 April, 2026 | 2:57 AM

కేంద్ర ఉద్యోగులకు 2% పెంపు

19-04-2026 01:21 AM
  1.   58% ఉన్న డీఏ.. 60 శాతానికి పెంపు
  2. పీఎంజీఎస్‌వై 2028 వరకు
  3. కేంద్ర కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. కరువు భత్యాన్ని (డీఏ) 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కొత్త డీఏ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల కనీస వేతనం (బేసిక్ శాలరీ)లో డీఏ 58శాతం ఉండేదని, కేంద్రం తాజా నిర్ణయంతో ఆ శాతం 60కు పెరగనుందని ప్రధాని తెలిపారు.

తాజా నిర్ణయంతో 50.46 లక్షల మంది ఉద్యోగులు, 68.27 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని వెల్లడించారు. డీఏ పెంపు నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ వార్షిక వ్యయం రూ.6,791 కోట్లు మేర పెరగుతుందని, అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏ పెంచామని పేర్కొన్నారు. 8వ వేతన సంఘ సిఫార్సుల మేరకు జీతభత్యాలు పెంచాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్న సమయంలో కేంద్రం నుంచి ఈ నిర్ణయం వెలువడడం విశేషం. కేంద్రం యేటా రెండుసార్లు (ఆరు నెలలకు ఒకసారి) డీఏను సవరిస్తుంది.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ భత్యాన్ని అందజేస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా డీఏ పెంపు నిర్ణయం జరిగింది. అలాగే, నౌకాయాన రంగం బలోపేతం చేసేందుకూ కేంద్రం అడుగులు వేసింది. దీనిలో భాగంగా రూ.1౨,౯౮౦ వేల కోట్లతో ‘సావరిన్ మ్యారిటైమ్ ఫండ్’ ఏర్పాటుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ ఫండ్ ద్వారా భారత్ నుంచి వెళ్లే, లేదా ఇతర దేశాల నుంచి వచ్చే దేశ నౌకలకు బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానాన్ని పెంచే ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)నూ క్యాబినెట్ 2028 వరకు పొడిగిం చింది. పథకం అమలుకు అదనంగా 3 వేల కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిం ది. క్యాబినెట్ సమావేశంలో కేంద్ర మం త్రు లు రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అర్జున్‌రామ్ మేఘవాల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, అశ్వినీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.