19 April, 2026 | 3:32 AM

నారీ శక్తిని అడ్డుకోవడం.. భ్రూణహత్య!

19-04-2026 01:39 AM

మహిళల కోటాపై మాటల తూటాలు!

  1. భారత మహిళల కలలను ధ్వంసం చేశారు
  2. విపక్షాలవి స్వార్థ రాజకీయాలు
  3. కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు ఎప్పుడూ వ్యతిరేకమే!
  4. వారు ఓడించింది బిల్లును కాదు.. మహిళా శక్తిని: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౮: భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించా రు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని విమర్శించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపో యిన నేపథ్యంలో.. దేశ ప్రజలను ఉద్దేశించి శనివారం ప్రధాని ప్రసంగించారు. ప్రతిపక్షాలు ఓడించింది బిల్లును కాదు.. మహిళా శక్తిని అని అన్నారు. మహిళా బిల్లును అడ్డుకొని విపక్షాలు భ్రూణహత్యకు పాల్పడ్డాయని, ఈ భ్రూణ హత్యలో ప్రధాన పాపం కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ పార్టీలదేనని ప్రధాని నిందించారు.

దేశ హితమే తమకు అత్యంత ముఖ్యమని, కొందరికి మాత్రం దేశం కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. దేశ హితం కోసం, నారీ శక్తి హితం కోసం బిల్లు తెచ్చామని ఆయన చెప్పారు. మహిళా శక్తిని ఈ దేశం ఇంకా చూడాల్సి ఉందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం నారీ శక్తిని అడ్డుకున్నారని అన్నారు.

‘మహిళా బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ అడ్డుకున్నాయి. అలాంటి కుటుంబ పార్టీలు మహిళలను ఎదగనీయవు. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మర్చిపోరు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు ‘తప్పకుండా శిక్ష పడుతుంది’ అని మోదీ కఠినంగా చెప్పారు.

ఆ పాపం వదిలిపెట్టదు..

‘మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పాపం వారిని వదిలిపెట్టదు. అన్ని విషయాలను మహిళలు గమనిస్తూనే ఉన్నారు. మహిళలు తమ హక్కు కోసం 40 ఏళ్లుగా పోరాడుతున్నారు. రిజర్వేషన్ల కోసం ఎందరో మహిళలు పోరాటం చేశారు. ఎంతో నిజాయతీతో తెచ్చిన బిల్లును ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. మహిళా బిల్లు క్రెడిట్ తీసుకోవాలని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేశాం. అన్ని రాష్ట్రాలకు సమాన బలం దక్కేలా బిల్లు తీసుకొచ్చాం. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు.

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ.. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో చాలాసార్లు అడ్డుకుంది. మహిళా బిల్లును అడ్డుకొని విపక్ష పార్టీలు నిజస్వరూపం చూపించాయి. కాంగ్రెస్ పార్టీ పరాన్న జీవిలా, స్థానిక పార్టీలపై ఆధారపడి జీవిస్తోంది. మహిళా బిల్లుపై కుట్రలు, కుతంత్రాలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, డీఎంకేకు ప్రజలు బుద్ధి చెబుతారు. నారీశక్తి వందన్ అధినియం బిల్లు వ్యతిరేకులు తగిన మూల్యం చెల్లించుకుంటారు’ అని ప్రధాని అన్నారు.

అదే కాంగ్రెస్ నైజం..

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అసత్యాలు ప్రచారం చేశాయని, స్వార్థ రాజకీయాలతో ఆయా రాష్ట్రాల ప్రజలనూ మోసం చేశాయని ప్రధాని అన్నారు. ‘డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని స్పష్టంగా చెప్పాను. అన్ని రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిథ్యం పెరుగుతుందని హామీ ఇచ్చాను. బిల్లు ఆమోదం పొందితే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరిగేవి. సీట్లు పెరిగితే కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి అన్ని పార్టీలకూ ప్రయోజనమే. రామ్ మనోహర్ లోహియా స్వప్నాలను సమాజ్‌వాదీ పార్టీ తుంగలో తొక్కింది.

కాంగ్రెస్ పార్టీ సంస్కరణలకు ఎప్పుడూ వ్యతిరేకమే. జన్‌ధన్, డిజిటల్ పేమెంట్స్, జీఎస్టీని, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దును కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఉగ్రవాదం, నక్సలిజం విషయాల్లోనూ కాంగ్రెస్ వైఖరి మర్చిపోలేం. సంస్కరణ పేరు వింటే చాలు.. కాంగ్రెస్ వెంటనే వ్యతిరేకిస్తుంది. ఆ పార్టీవన్నీ నెగటివ్ రాజకీయాలు.

ఏ సంస్కరణ వచ్చినా కాంగ్రెస్ అడ్డుకుంటుంది.. దుష్ర్పచారం చేస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. దేశానికి మేలు చేసే ప్రతి నిర్ణయాన్నీ అడ్డుకోవడం కాంగ్రెస్ నైజం. సైనికుల వన్ ర్యాంక్, వన్ పెన్షన్‌ను 40 ఏళ్లపాటు కాంగ్రెస్ అడ్డుకుంది. దేశంలోని మహిళలు, యువతులు కలిసి కాంగ్రెస్‌కు గట్టిగా జవాబిస్తారు. మహిళలు ఎన్నటికీ క్షమించరు’అని మోదీ అన్నారు.