2 July, 2026 | 12:46 PM

స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం

02-07-2026 12:10 PM

హైదరాబాద్: గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై(BRS leaders Allegations) కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ చర్చకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలని ఆరోపించారు. మీరు చేసిన వ్యాఖ్యలు నిజమైతే చర్చకు రావాలన్నారు. హాస్టళ్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్ రావు, ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారని పొన్నం వెల్లడించారు.

మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. ప్రజలందరికీ నిజం తెలియాలని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా మేం చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు. మొత్తం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరిపామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. నాలుగు శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు పిలిచామని తెలిపారు. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చనే అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారని మంత్రి ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరుతున్నామని వెల్లడించారు.

పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన ప్రొక్యూర్ మెంట్ పై చర్చకు సిద్ధమన్నారు. అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో, ఏదో తప్పుడు సమాచారం ఇస్తే దానిపై మాట్లాడవద్దని సూచించారు. మా దగ్గర రికార్డులన్నీ ఉన్నాయి.. చెప్పేందుకు సిద్ధమని తేల్చిచెప్పారు. చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మిమ్మల్ని పిలవడం లేదన్నారు. మీవద్ద ఏమైనా ఆధారాలుంటే చూపించాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

బట్ట కాల్చి ముఖంపై వేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటేనని చురకలంటించారు. ''మేం తప్పు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాం''అని పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. 'తాడూ బొంగరం లేనివాళ్లతో చర్చించం.. ఎమ్మెల్యేలే రావాలి. హాస్టల్ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం.. వారి సంక్షేమం మా బాధ్యత, నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.. జాగ్రత్త' అని పొన్నం ప్రభాకర్ మెచ్చరించారు. అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నామని మంత్రి వెల్లడించారు.