22 August, 2026 | 5:37 PM

అబద్ధపు కేసుల తీరుతెన్నులపై సదస్సు

22-08-2026 04:41 PM

పటాన్ చెరు, ఆగస్టు 22(విజయక్రాంతి): అబద్ధపు కేసుల తీరుతెన్నులను పరిశీలించి, తగిన మార్గదర్శనం చేసేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి.) ఆగస్టు 21-22 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. యుగాంతర్, ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐ ఐటీ) హైదరాబాద్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ మహిళా హక్కుల న్యాయవాది, కార్యకర్త, రచయిత్రి, మజ్లిస్ (MAJLIS) సహ వ్యవస్థాపకురాలు ఫ్లావియా ఆగ్నెస్ కీలకోపన్యాసం చేశారు. న్యాయ, న్యాయవాద రంగాలలో తనకున్న విస్తృత అనుభవాన్ని ఉపయోగించి, ఆమె ముఖ్యంగా గృహహింస, లింగ సమానత్వం వంటి రంగాలలో తప్పుడు కేసుల భావన చుట్టూ ఉన్న ఆందోళనలను ప్రస్తావించారు.

ఈ సదస్సు విద్యావేత్తలు, న్యాయవాదులు, పరిశోధకులు, కార్యకర్తలు, విద్యార్థులను ఒకచోట చేర్చి, తప్పుడు కేసులు అనే భావనను, చట్టంలోనూ, ప్రజా చర్చలలోనూ అటువంటి కథనాలు ఏవిధంగా ప్రచారంలో ఉన్నాయి, వాటిని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే అంశాలను విమర్శనాత్మకంగా పరిశీలించడానికి ఒక అంతర్-విభాగ వేదికను అందించింది. ఈ సమావేశం విలువైన అంతర్దృష్టులను అందించింనందుకు, అలాగే సంభాషణ, అభ్యసనానికి అవకాశాన్ని కల్పించినందుకు ఇందులో పాల్గొన్నవారు ప్రశంసించారు.