సత్తుపల్లిలో బీజేపీ జాతీయ నాయకుడు పర్యటన
ఎస్ఐఆర్, ఫుడ్ పార్క్ అంశాలపై స్పందన
సత్తుపల్లి. జూలై 29(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో జరిగిన అక్రమాలపై విమర్శలు చేశారు. అనంతరం కిష్టారం గ్రామంలో శైలో బ్యాంకర్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లాలో పర్యటించిన బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియపై మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు కల్పించే విధంగా ఎస్ఐఆర్ రూపొందించబడిందని అన్నారు.
ప్రతిపక్షాలకు నచ్చినా నచ్చకపోయినా ఇది పారదర్శకమైన ప్రక్రియ అని వ్యాఖ్యానించారు.ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఎమర్జెన్సీ, ఆర్టికల్ 370, జాతీయ సమైక్యత వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థించారు. ఉగ్రవాదంపైb కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.నీట్ అంశంపై మాట్లాడుతూ... విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడం తప్పు కాదని, అయితే ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం సరైంది కాదన్నారు.
గతంలో కూడా అనేక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయినప్పటికీ ఎవరూ రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతూ, రాహుల్ గాంధీ ముందుగా రాష్ట్రంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలని సూచించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముగ్గురు మంత్రులను రాజీనామా చేయించి ముగ్గురు విద్యార్థులను మంత్రులుగా నియమించాలని డిమాండ్ చేశారు.అనంతరం బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో జరిగిన అక్రమాలపై స్పందిస్తూ... ఆ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, సమగ్ర విచారణకు హామీ లభించిందన్నారు.
పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, అయితే రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా భూముల కేటాయింపులు జరిగితే వాటిపై విచారణ జరగాల్సిందేనని పేర్కొన్నారు. దీపక్ నెక్స్జెన్ కంపెనీకి 72 ఎకరాల భూమి కేటాయింపుపై ప్రశ్నలు లేవనెత్తారు. కిష్టారం గ్రామంలో శైలో బ్యాంకర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కలకత్తాకు చెందిన సమంతా కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తాగునీరు, గాలి, ఆహారం కలుషితమవుతున్నాయని ఆరోపిస్తూ, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.






