29 July, 2026 | 10:18 AM

డ్రోన్లతో కూరగాయల సాగుకు ఆధునిక సాంకేతికత

29-07-2026 09:08 AM

టమాటా గ్రాఫ్టింగ్‌పై రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన

గజ్వేల్: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం పరిధిలోని ములుగు పీజీఐహెచ్ఎస్(Mulugu PGIHS) ఆధ్వర్యంలో, పుష్కల్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హవాన్ డ్రోన్ టెక్నాలజీస్ సంస్థల సహకారంతో దత్తత గ్రామమైన క్షీరసాగర్‌లో రైతులకు వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై అవగాహన సదస్సు, ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.

కూరగాయల పంటల్లో డ్రోన్ల ద్వారా ఎరువులు, సూక్ష్మపోషకాలు, పురుగుమందుల పిచికారీ విధానం, డ్రోన్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికత ప్రాముఖ్యతపై నిపుణులు రైతులకు వివరించారు. అనంతరం డ్రోన్‌తో పంటలపై ప్రత్యక్షంగా పిచికారీ చేసి ప్రదర్శించారు. దీంతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా వ్యవసాయ పనులు నిర్వహించవచ్చని తెలిపారు.

అనంతరం పీజీఐహెచ్ఎస్ విద్యార్థులు టమాటా గ్రాఫ్టింగ్ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. గ్రాఫ్టింగ్ వల్ల మొక్కలకు వ్యాధి నిరోధకత పెరగడం, అధిక దిగుబడి రావడం, మొక్కల జీవనకాలం పెరగడం వంటి ప్రయోజనాలను రైతులకు వివరించారు. రైతులు ఆసక్తిగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో పీజీఐహెచ్ఎస్ ఆఫీసర్ ఇన్‌చార్జి డా. డి. విజయ, ఖీరసాగర్ సర్పంచ్ కోన్యాల బాల్‌రెడ్డి, కన్వీనర్ డా. వి. సుచిత్ర, సభ్యులు డా. జి. సతీష్, పులి శ్రీనివాస్, బి. చంద్రశేఖర్, పుష్కల్ అగ్రోటెక్ రీజినల్ సేల్స్ మేనేజర్ అనూక్ బాబు, హవాన్ డ్రోన్ టెక్నాలజీస్‌కు చెందిన మహేష్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రగతిశీల రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.