సామాజిక సేవలకు గుర్తింపుగా దండు సారయ్యకు నంది అవార్డు
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్యకు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా "బెస్ట్ సోషల్ సర్వీస్ నంది అవార్డు" లభించింది. మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో దండు సారయ్య చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దండు సారయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ మరింత అంకితభావంతో ప్రజా సేవలో కొనసాగుతానని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, అభిమానులు ఆయనను అభినందించి, ఈ అవార్డు ఇల్లందు పట్టణానికి గౌరవకారణమని పేర్కొన్నారు.






