Rythu Gosa - BJP Bharosa: పరిగిలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగిలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటిస్తున్నారు. రైతు గోస- బీజేపీ భరోసా(Rythu Gosa - BJP Bharosa) యాత్రలో భాగంగా బీజేపీ నేతలు పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అరిగోస పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు బీజేపీ ఉందని ఆ పార్టీలు తెలిపారు.
''తెలంగాణ అన్నదాతలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది.! బీజేపీ చేపట్టిన 'రైతు గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో రైతన్నలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు బయలుదేరడం జరిగింది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న దగాను బట్టబయలు చేయడంతో పాటు, రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో విఫలమైందో ఎండగడతాం.'' అని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఎక్స్ లో పోస్టు చేశారు.
"రైతు గోస - బిజెపి భరోసా" కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో మే 25, 26, 27 తేదీల్లో వ్యవసాయ మార్కెట్ల సందర్శన, రైతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రైతుల పక్షాన పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, రైతన్నలకు పూర్తి భరోసా కల్పించే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
'రైతు గోస- బీజేపీ భరోసా' తేదీలు: మే 25, 26, 27.
వ్యవసాయ మార్కెట్ సందర్శనలు: వికారాబాద్, గజ్వేల్, భువనగిరి, జనగామ, కాటారం, మంథని, పెద్దపల్లి.
రైతులతో సమావేశాలు: ఆలేరు, ములుగు.






