బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు
- ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, మైదానాలు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. సోమ వారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, కార్యాలయ ఆవరణల్లో మద్యం సేవించే వారిపై చర్యలుంటాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, విద్యాసంస్థల ఆవరణలను అపవిత్రం చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.
ఆదివారం రాత్రి ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణవాడలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తున్న జుబేర్ ను అదుపులోకి తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వారు ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక గస్తీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయని, ప్రజలు కూడా బహిరంగ మద్యం సేవించే వారి గురించి సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.






