27 July, 2026 | 3:23 PM

'మార్చ్ టు పార్లమెంట్'పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

27-07-2026 03:02 PM

శాంతియుత నిరసన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ పేపర్ లీక్(NEET-UG Paper Leak) వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో నిర్వహించిన 'మార్చ్ టు పార్లమెంట్'పై సీజేఐ సూర్య కాంత్(CJI Surya Kant) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుత నిరసన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు(Supreme Court) సోమవారం స్పష్టం చేసింది. ఆందోళనలపై పోలీసుల మితిమీరిన బలప్రయోగం సమర్థించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసులపై ఆకతాయిల దాడులు తీవ్ర ఆందోళనకరమని జస్టిస్ బాగ్చి తెలిపారు. శాంతియుత నిరసనలు, పోలీసు చర్యలపై మార్గదర్శకాలు అవసరమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.

నిరసనల్లో విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారం అండాలని కోర్టు వెల్లడించింది. హింసకు తావులేకుండా నిరసనకారులు సంయమనం పాటించాలని కోర్టు ఆదేశించింది. విద్యార్థుల నిరసనలు, లాఠీఛార్జిపై దాఖలైన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. బీహార్‌లో నిరసనకారులపై ఏకే-47లతో సహా బలప్రయోగం చేయడాన్ని ఎత్తిచూపుతూ ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా(RJD leader Manoj Jha) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. జూలై 20న పార్లమెంటు వైపు విద్యార్థులు చేపట్టిన 'సంసద్ చలో' యాత్రపై బాష్పవాయువు, లాఠీలతో దాడి జరిగిన ఘటనలపై విచారణ కోరుతూ దాఖలైన ఇతర పిటిషన్లతో పాటు దీనిని కూడా కోర్టు విచారణకు జతచేసింది.