అర్బన్ పార్కులుతో పాటు బెల్లంపల్లి అభివృద్ధి చేయాలి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించకుండా కొత్తగా అర్బన్ పార్కుల పేరుతో నిధులు ఖర్చు చేయడం కంటే, ఇప్పటికే ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని టీఎన్టియూసీ రాష్ట్ర కార్యదర్శి టీ.మణిరామ్ సింగ్, ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. పోచమల్లు డిమాండ్ చేశారు.
నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో అధ్వానంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, ప్రభుత్వ ఆసుపత్రులు–పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై పాలకులు దృష్టి సారించాలన్నారు.
బెల్లంపల్లి ప్రాంతం సింగరేణి కార్మికుల కృషితో అభివృద్ధి చెందిన ప్రాంతమని తెలిపారు. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందిన్నారు. ప్రజలకు అత్యవసరమైన పనులను పక్కనపెట్టి పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం సరైన నిర్ణయం కాదని కార్మిక సంఘాల ఐక్యవేదిక సూచిస్తుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.






