8 August, 2026 | 3:57 AM

బీడీ కార్మికుల ఆందోళన విరమణ

08-08-2026 12:22 AM

బచ్చన్నపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి) : దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. 4 రోజులుగా ఉధృతంగా సాగిన రిలే నిరాహార దీక్షకు తెర పడింది. బచ్చన్నపేట సెంటర్ పరిధిలో బీడీ ప్రొడక్షన్ తగ్గుతోందనే కారణంతో యాజమాన్యం ఇక్కడి టేకేదారులను కుకునూరుపల్లి, దుద్దెడ సెంటర్లకు మార్చేందుకు  ఆలోచిస్తోందనే వార్త కార్మికుల్లో కలకలం రేపింది.

ఈ నిర్ణయం వల్ల వందలాది మంది స్థానిక కార్మికులు, ప్యాకింగ్ కార్మికులు ఉపాధి కోల్పోతారనే భయంతో వారు వెంటనే రిలే నిరాహార దీక్షకు దిగారు. కార్మికుల ఆందోళనను గమనించిన యాజమాన్యం దిగొచ్చి. శుక్రవారం రేంజ్ మేనేజర్, బీడీ క్వాలిటీ అధికారి దీక్షా శిబిరానికి వచ్చి కార్మిక నాయకులు మంచే నర్సింలు, శోభన్. టేకేదారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చర్చల్లో యాజమాన్యం కీలక హామీలిచ్చింది.

బచ్చన్నపేట సెంటర్ యథావిధిగా కొనసాగుతుందని, దీన్ని మరే ఇతర సెంటర్కు షిఫ్ట్ చేయబోమని, ప్రొడక్షన్ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, టేకేదారులు కూడా సహకరించాలని కోరారు. అలాగే ప్యాకింగ్ కార్మికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని, యాజమాన్యం ఇచ్చిన హామీలను విశ్వసిస్తూ కార్మిక ప్రతినిధులు. ప్యాకింగ్ కార్మికులు దీక్షను విరమించారు.