సమానత్వ సాధనకే రిజర్వేషన్లు
వరంగల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): వివిధ వర్గాల మధ్య అసమానతలను తొలగించి సామాజిక, విద్యా, ఆర్థికపరమైన సమానత్వ సాధనకే రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నారని కాకతీయ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ తిరునహరి శేషు పేర్కొన్నారు. మండల్ డే ని పురస్కరించుకొని విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శేషు మాట్లాడుతూ మండల్ కమీషన్ సిఫారసుల మేరకు 1990 ఆగస్టు 7న నాటి వి.పి.సింగ్ ప్రభుత్వం ఓబీసీలకు విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లను ఇచ్చిందన్నారు.
ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే ప్రతిభకి అన్యాయం జరుగుతుందని నాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారే నేడు ఈడబ్ల్యూఎస్ రూపంలో రిజర్వేషన్లు పొందుతున్నారని, కాబట్టి దేశంలో అసమానతలు కొనసాగినంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన విధంగానే బలహీన వర్గాలకు కూడా చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు.
జన్ జీ ఉద్యమం పేరుతో రిజర్వేషన్ హఠావో ఆందోళనతో ముందుకు వస్తున్న వారు ముందుగా తమ రిజర్వేషన్లను వదులుకొని ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాలు మండల్ కమీషన్, జస్టిస్ రోహిణి కమీషన్ సిఫారసులను అమలు చేయకుండా బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు.






