ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి
- వర్గ పోరుగా మారిన రాజకీయం
- ఆధిపత్య పోరులో జక్కిడి బలి
- ఆడియో, వీడియోలతో తెర వెనుక రాజకీయం
- ఇద్దరు నేతల మధ్య నలుగుతున్న పార్టీ శ్రేణులు
ఎల్బీనగర్, అగస్టు 21(విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గం లో ప్రస్తుతం రెడ్డి వర్సెస్ బిసి కాంగ్రెస్ వర్గ పోరు రాజకీయం నడోస్తుంది.పార్టీ సీనియర్ నేత జ క్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ ఇప్పుడు ఎల్బీనగర్ రాజకీయంలో పెను తుపాను సృష్టి స్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల ను ఏకతాటిపైకి తెచ్చి బలోపేతం చేయాల్సిన పార్టీ అంతర్గత రాజకీయం, ఆధిపత్య పోరు చివరకు నేత సస్పెన్షన్కు దారితీసింది.
వర్గపోరుకు ‘అసెంబ్లీ’ ఆజ్యం..
గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ఎల్బీనగర్ కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు భగ్గుమన్నాయి. ఎన్నికల్లో తనకు టికెట్ దక్కుతుందని జక్కిడి ఆశించగా, చివరి నిమిషంలో మధుయాష్కీగౌడ్ బరిలోకి దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఎల్బీనగర్లో మాత్రం బీఆర్‌ఎస్ జయకేతనం ఎగరవేసింది. ఈ ఓటమి ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. తన స్థానిక బలం ఉపయోగపడేదని జక్కిడి భావిస్తుండగా, అగ్రకుల నాయకుల అస్సహకారం వల్లే ఓడిపోయానని మధుయాష్కీ వర్గం భావించడంతో నియోజకవర్గ పార్టీ కేడర్ స్పష్టంగా బీసీ, రెడ్డి వర్గాలుగా చీలిన పరిస్థితి ఏర్పడింది.
నాలుగు దశాబ్దాల ప్రస్థానం.. సస్పెన్షన్ వేటు..
రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎల్బీనగర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తూ, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలింపు వంటి అనేక ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర జక్కిడికి ఉంది. ఆయన కుమారుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల లీకైన కొన్ని వివాదాస్పద ఆడియో క్లిప్పులు జక్కిడి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. బీసీ, ఎస్టీ వర్గాలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తడంతో, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మధుయాష్కీపై తీవ్ర ఆరోపణలు.. ఇన్ ఛార్జి ’మౌనం’ వెనుక కథేంటి?
ఈ సస్పెన్షన్ వెనుక మధుయాష్కీగౌడ్ కుట్ర ఉందంటూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్ విగ్రహ తొలిగింపును అడ్డుకున్నప్పటి నుంచే నాపై కక్ష పెంచుకున్నారు. కల్పిత వీడియోలు సృష్టించి, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు.
మధుయాష్కీ అనుచరులు అసాంఘిక కార్యకలాపాలు, వసూళ్లకు పాల్పడుతూ పార్టీ పరువు తీస్తున్నారు‘ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, నియోజకవర్గంలో పార్టీ పరువు బజారున పడుతున్నా, ఈ తీవ్ర ఆరోపణలపై ఇన్ ఛార్జి మధుయాష్కీగౌడ్ మౌనం వీడకపోవడంపై సగటు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌కు కలిసివస్తున్న కాంగ్రెస్ పంచాయితీ..
నియోజకవర్గం లో అంతర్గత కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు కేసులకు దిగడం, బహిరంగంగా దుమ్మెత్తి పోసుకోవడం వల్ల ఎల్బీనగర్లో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతోంది. ఇరు వర్గాల మధ్య నడుస్తున్న ఈ ’కులాల పంచాయితీ’ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొందరు పార్టీ నేతలు తీరూ తాము కూర్చున్న కొమ్మనే నరుక్కునే వ్యహారం కొనసాగుతుంది.






