2028లో బీసీలదే అధికారం
_ తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారింది
- జూలై 12న హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీ
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట,(విజయక్రాంతి): 2028 లో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారిందని ఈ సునామీని ఎవరు ఆపలేరని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర మల్సూర్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాధికారం లక్ష్యంగా బీసీ సమాజంలో రాజకీయ చైతన్యం పెరిగిందన్నారు. పిడికెడు శాతం ఉన్న వారి పాలన ఇంకెన్నాళ్ళని ప్రశ్నించారు.
బీసీలు బలమైన శక్తిగా ఎదిగారని ఇక అగ్రకులాల ఆటలు సాగవన్నారు. 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎం గా కొనసాగుతా అంటున్నాడని, బిఆర్ఎస్ లో కూడా సార్ రావాలి ముఖ్యమంత్రి కావాలని ప్రగల్భాలు పలుకుతున్నారని, పదేళ్ల పరిపాలన సరిపోదా అని ఎద్దేవా చేశారు. సింహభాగం ఉన్న బీసీలను పాలకులుగా కాకుండా పాలితులుగా జెండాలు మోసేవారిగా, ఓట్లు వేసే యంత్రాలుగా అణచివేస్తున్నారన్నారు. జూలై 12న హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీ, ఆగష్టు 7న జాతీయ ఓబిసి సమావేశం, సెప్టెంబర్ లో బీసీల రాజ్యాధికార రథయాత్ర రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలు పల్లె నుంచి పట్టణ వరకు రాజకీయ దామాషా రాజ్యాధికారమే లక్ష్యంగా కొనసాగుతుందన్నారు.
హైదరాబాదులో డిసెంబర్ లో 10 లక్షల మందితో రాజకీయ యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటి అగ్రకులాల్లో వణుకు పుట్టించారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర మల్సూర్ గౌడ్, బీసీ ఐకాస చైర్మన్ జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఉప్పల మధు యాదవ్,బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల దేవరాజు యాదవ్, అసోసియేటెడ్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షుడు పోతురాజు నరసయ్య, జిల్లా కన్వీనర్ సూర్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






