21 April, 2026 | 5:47 AM

సభలో బీసీ నేతలకు దక్కని ప్రాధాన్యం

21-04-2026 02:49 AM

ఫ్లెక్సీల్లో కనిపించని ఫొటోలు

కరీంనగర్/జగిత్యాల, ఏప్రిల్ 20 ( విజయక్రాంతి ): జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీలోని బీసీ సామాజికవర్గ సీనియర్ నేతలకు జరుగుతున్న అవమానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉద్యమ కాలం నుంచి పార్టీని నమ్ముకున్న నేతలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నా రనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్‌గా పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన ఉద్యమనాయకురాలు తుల ఉమకు తాజా సభలో తీవ్ర అన్యాయం జరిగినట్లు ఆమె అనుచరులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల్లో కానీ, సభా వేదికపై ఉన్న ఫొటోల్లో కానీ ఆమెకు కనీస స్థానం కల్పించకపోవడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన గౌడ్ సామాజిక వర్గ సీనియర్ నేత, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

తక్షణమే పార్టీ అధిష్టా నం జోక్యం చేసుకుని ఈ విభేదాలను పరిష్కరించకుంటే, భవిష్యత్తులో కేడర్‌లో అసహనం మరింత పెరిగే అవకాశం ఉందని శ్రేణులు భావిస్తున్నాయి. జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి రావడం ఇష్టం లేక పార్టీ జిల్లా కార్యాలయం లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్లెక్సీలు చించి వేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ వర్గీయుల లేక మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత వర్గీయుల పనా చర్చించుకుంటున్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఒంటెద్దు పోకడ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న చర్చ కొనసాగుతుంది. విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. నేను నాలుగు పేపర్లనే చూస్తాను అనడం విలేకర్లలో అసంతృప్తి రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలను అవమానంగా భావించిన జగిత్యాల మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, కేసీఆర్ సభ ఏర్పాట్లపై నిర్వహించాల్సిన కీలక సమావేశాన్ని మీడియా ప్రతినిధులు పూర్తిగా బహిష్కరించారు.