24 April, 2026 | 1:47 AM

బ్యాంకుల సేవలు అభినందనీయం

24-04-2026 12:27 AM
  1. ఎంపీ మల్లు రవి
  2. సీఎస్‌ఆర్ కింద బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

వనపర్తి, ఏప్రిల్ 23(విజయక్రాంతి): కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  వనపర్తిలోని పీఎం శ్రీ గల్స్ స్కూల్‌లో 500 సైకిళ్లను పంపిణీ చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమం బాలికల విద్యకు ఎంతో తోడ్పాటునందిస్తుందని నాగర్‌కర్నూల్‌ఎంపీ మల్లు రవి అన్నారు. బ్యాంకర్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి తమ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిటీ స్కాన్ సెంటర్ ను ఏర్పాటు చేశారని, అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను కూడా వారు సామాజిక బాధ్యతగా నిర్మించారని తెలిపారు.ఇదేవిధంగా జిల్లాలో ఉన్న అందరూ బ్యాంకర్లు సమాజానికి తమ వంతు కృషిగా సామాజిక బాధ్యత కింద సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురబి, బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ మనోజ్ శ్రీవాస్తవ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.శివకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, డీఈఓ అబ్దుల్ ఘని తదితరులు పాల్గొన్నారు.