హోర్ముజ్ మొదటి ఆదాయం వచ్చేసింది!
- పన్ను మొత్తం సెంట్రల్ బ్యాంక్ ఖాతాలో జమైంది
- ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్‌రెజా
టెహ్రాన్, ఏప్రిల్ 23: హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ మొదటిసారిగా టోల్ వసూలు చేసిందని ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్‌రెజా గురువారం వెల్లడించారు. ఈ టోల్ మొత్తం తమ సెంట్రల్ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. కానీ ఈ టోల్‌ను ఏ దేశ నౌక నుంచి వసూలు చేశారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. గతంలోనే ఇరాన్ టోల్ ప్రతిపాదనను తీసుకొచ్చింది.
ఈ రంకగా వచ్చిన ఆదాయాన్ని తమ దేశ పునర్నిర్మాణం కోసం వినియోగిస్తామని కూడా తెలిపింది. ఇరాన్ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. రుసుములు చెల్లిస్తున్న నౌకలను హోర్ముజ్‌ను దాటేందుకు అనుమతి ఇస్తోంది. తాజాగా ఒక ట్యాంకర్ జలసంధిని దాటడానికి 2 మిలియన్ డాలర్ల నగదు చెల్లించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే టెహ్రాన్ ప్రభుత్వం ఈ పన్ను వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
నౌకల యజమానులు, అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి వివరాలను ఐఆర్‌జీసీ అధికారులకు ముందే అందజేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక బ్యారెల్ చమురుకు ఒక డాలర్ పన్ను చెల్లించాలి. ఈ లెక్క ప్రకారం.. ఆ షిప్‌లో రెండు మిలియన్ బ్యారెళ్ల ఇంధనం ఉంటే.. రెండు మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నగదును చైనీస్, యువాన్, క్రిప్టో కరెన్సీ రూపంలోనే స్వీకరిస్తారు. ఒకసారి నౌకలకు టోల్ చెల్లింపులు పూర్తయ్యాక ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల నుంచి ఐఆర్‌జీసీ నౌకలు వాటికి రక్షణగా వెళ్లనున్నట్లు సమాచారం.






