28 July, 2026 | 1:19 AM

బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.1,278.39 కోట్లు

28-07-2026 12:50 AM
  1. ఆదాయం రూ.36,681.09 కోట్లు
  2. త్రైమాసిక ఫలితాల్లో వెల్లడి

హైదరాబాద్, జూలై 27(విజయక్రాంతి): ప్రభుత్వ రంగ బ్యాంక్ అ యిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఆరోగ్యకరమైన ఆస్తుల నాణ్యతతో బ్యాంక్ స్థిరమైన, బలమై నవృద్ధి జోరును కొనసాగించింది. తన స్వతంత్ర నికర లాభంలో దాదాపు 72% క్షీణతను (ఏడాది ప్రాతిపదికన) నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ.1,278.39 కోట్లుగా నమోదైంది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ లాభం రూ.4,541.36 కోట్లుగా ఉండేది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.6% పెరిగి రూ.36, 681.09 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, ఆకస్మిక వ్యయాలకు ముందు నిర్వహణ లాభం ఏడాది ప్రాతిపదికన 1.3% తగ్గి రూ.8,127. 25 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్‌ఆఫ్ బరోడా ప్రపంచవ్యాప్త డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 13.8% పెరిగి రూ.16,33,559 కోట్లకు చేరాయి.

ఇందులో దేశీయ డిపాజిట్లు రూ.13, 81,535 కోట్లుగా నమోదయ్యాయి, ఇవి ఈ త్రైమాసి కంలో ఏడాది ప్రాతిపదికన 14.7% వృద్ధిని సాధించాయి. దేశీయ స్థూల రు ణాలు ఏడాది ప్రాతిపదికన 16.1% వృద్ధితో రూ.11,50, 906 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో ప్రపంచవ్యాప్త రుణాలు 17.4% పెరిగి రూ.14, 16,898 కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.5% స్వల్ప వృద్ధితో  రూ.12,524 కోట్లకు పెరగగా, నికర వడ్డీ మార్జిన్ మాత్రం 2.91% నుంచి 2.77%కి తగ్గింది.

స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి ఏడాది ప్రాతిపదికన 29 బేసిస్ పాయింట్లు తగ్గి 1.99%కి చేరగా, నికర ఎన్‌పీఏ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 0.50%కి పరిమితమైంది. అలాగే, క్యూ1ఎఫ్‌వై27లో మూలధన సమర్ధత నిష్పత్తి  ఏడాది ప్రాతిపదికన 131 బేసిస్ పాయింట్లు తగ్గి 16.30%కి చేరింది. జూలై 24న బీఎస్‌ఈ లో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు ధర 1.48% పెరిగి రూ.246.60 వద్ద ముగిసింది.