నడిరోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహంతో బండి సంజయ్ నిరసన
హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం(Narsampet Mandal) ముత్తోజిపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట తరలించేందుకు కార్మికులు ప్రయత్నించారు. నర్సంపేట డిపోకు తీసుకెళితేనే శంకర్ గౌడ్(RTC driver Shankar Goud) ఆత్మకు శాంతి చేకూరుతుందని కార్మికులు వాపోయారు. మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించే వరకు కదిలేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళితే పోలీసులు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు కేంద్రమంత్రి బండి సంజయ్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల అభ్యంతరంతో ఆర్టీసీ కార్మికులు, బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పదేపదే అడ్డుకుని శవపేటికను రోడ్డుపైనే ఉంచడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముత్తోజిపేటలో నడిరోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహాంతో బండి సంజయ్(Bandi Sanjay protest) నిరసన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని బండి సంజయ్ పోలీసులకు సూచించారు. శంకర్ గౌడ్ కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ డిపోకు తరలించాలని కేంద్రమంత్రి కోరారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించేందుకు కార్మికులు అంబులెన్స్ రప్పించారు. కార్మికులు, కుటుంబసభ్యులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలిస్తున్నారు.






