బేటీ బచావో నినాదాన్ని… బేటా బచావోగా మార్చారు
మైనర్ బాలికపై హత్యాచారం చేసిన సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
బండి సంజయ్‌ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి
– బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కొరిపెల్లి నిర్మల
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కొరిపెల్లి నిర్మల, నాయకులు మాట్లాడుతూ… “బేటీ బచావో” అంటూ దేశవ్యాప్తంగా నినాదాలు ఇచ్చే బీజేపీ, ఇప్పుడు “బేటా బచావో” విధానాన్ని అమలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, నిందితుడు సాయి భగీరథ్‌ను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైందన్నారు. చట్టం అందరికీ సమానమైతే అధికార పార్టీల నేతల కుటుంబాలకు మాత్రం ఎందుకు మినహాయింపు ఇస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బండి సంజయ్, ఇప్పుడు తన కుమారుడిని కాపాడేందుకు అధికారాన్ని ఉపయోగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు.
బాధితురాలి 164 సి ఆర్పీసీ స్టేట్మెంట్ ఇప్పటివరకు నమోదు చేయకపోవడం కూడా చట్టపరమైన నిర్లక్ష్యమేనని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ స్థాయి మహిళా అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి, హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసును మీడియా దృష్టికి రాకుండా దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. “హనీ ట్రాప్” పేరుతో అసలు అంశాన్ని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మహిళల భద్రతపై మాట్లాడే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ ప్రయోజనాల కోసం కేసును బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘు వర్ధన్ రెడ్డి, లేతకుల రఘుపతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరి శంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, కౌడి పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, నాయకులు ఆకుల మధుకర్, కందుకూరి ఆంజనేయులు, గడీల జగన్ రెడ్డి, శ్యామల శ్రీనివాస్, పాశం నరేందర్ రెడ్డి, పుల్ల శ్రీనివాస్, బుల్లెట్ శంకర్, నర్సిరెడ్డి, కళ్యాణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.






