31 July, 2026 | 4:04 AM

ఆర్వోబీ జాప్యంపై బండి అసంతృప్తి

31-07-2026 01:00 AM

కరీంనగర్,జూ లై30(విజయక్రాంతి): ఆర్ ఓ బి సమీపంలోని కల్వర్టులో వ్యక్తీ పడిపోయారనే సమాచారం రావడంతో అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్వోబీ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారిని ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ పనుల్లో జాప్యాన్ని తప్పుపట్టారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ మాట్లాడుతూ తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణపై ద్రుష్టి పెట్టిందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఆర్వోబీ నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణం చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా పనులు ఆగిపోయాయయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో న్యూఢిల్లీ నుండి ఫోన్లో మాట్లాడారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్ద బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హుటాహుటిన తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్దకు వెళ్లారు. ఆర్వోబీ సమీపంలోని కల్వర్టును పరిశీలించారు. ఆర్వోబీ వద్ద రాకపోకలకు జరుగుతున్న ఇబ్బందులను గమనించారు. బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వనందున, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఆయా పనులను చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే యుద్ద ప్రాతిపదికన ఆయా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.