బండి భగీరథ్‌ను క్రిమినల్ అనకూడదు
- నేర నిరూపణ అయ్యే వరకు అలాంటి పదాలు వాడొద్దు
- రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి స్పష్టీకరణ
- భగీరథ్ బెయిల్ పిటిషన్‌లపై న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు
- మధ్యంతర బెయిల్‌పై నిర్ణయాన్ని నేటికి, ముందస్తు బెయిల్‌పై విచారణ వారం రోజులపాటు వాయిదా
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఫోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై గురువారం సుదీర్ఘ విచారణ జరిగింది.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. మధ్యం తర బెయిల్‌పై నిర్ణయాన్ని నేటికి (శుక్రవారం), ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా పిటిషనర్ తరఫున న్యాయవాది నిరంజన్‌రెడ్డి, పోలీసుల తరఫున పీపీ నాగేశ్వర్‌రావు వాదన లు వినిపించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. బండి భగీరథ్‌ను క్రిమినల్ అని బాధితురాలి తరఫు న్యాయవాది సంబోధించారు.
ఆయన వ్యాఖ్య ల పట్ల భగీరథ్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. నేర నిరూపణ అయ్యే వరకు క్రిమినల్ అనకూడదని స్పష్టం చేశారు. న్యాయవాదులు సంయ మనంతో వ్యవహరించాలని, లేకపోతే పిటిషన్‌ను మరో బెంచ్‌కు మార్చుకోవచ్చని జడ్జి సూచించారు.
బాధితురాలి బర్త్ సర్టిఫికెట్‌లను పరిశీలించండి
భగీరథ్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బాధితురాలి వయసుపై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల చార్జిషీట్‌లో ఆమె వయసు 15 ఏళ్లుగా పేర్కొన్నారన్నారు. కానీ జీహెచ్‌ఎంసీ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో 2008 ఉందని, పాన్‌కార్డులో 2011 ఉందని తెలిపారు.
2021లో డ్రైవింగ్‌కు అర్హత లేకుండా పట్టుబడినప్పుడు బాధితురాలి వయసు 15 ఏళ్లు ఉందని కోర్టు దృష్టికి న్యాయవాది నిరంజన్‌రెడ్డి తీసుకెళ్లారు. చార్జిషీట్, పాన్‌కార్డులో పుట్టిన తేదీ వేర్వేరుగా ఎందుకున్నాయని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. బాధితురాలి పుట్టిన తేదీ, వయస్సుపై స్పష్టత కోసం గత పోలీసు రికార్డులు, బర్త్ సర్టిఫికెట్‌లను పరిశీలించాలని న్యాయస్థానం ఆదేశించింది.






