22 July, 2026 | 3:17 AM

షూటింగ్‌లో గాయపడ్డ బాలకృష్ణ

22-07-2026 02:33 AM

టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన మోకాలికి స్వల్ప గాయమై యింది. బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రసు తం కాకినాడ పోర్ట్‌లో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ కాలు జారి కింద పడిపోయారు. దీంతో మూవీ యూనిట్ వెంటనే షూటింగ్ నిలిపివేసి, బాలకృష్ణను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన మోకాలు భాగంలో కండరం దెబ్బ తిన్నదని, చిన్న సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందని వైద్యులు సూచించారు.

ఈ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా తెలిజేశారు. ఈ ఘటనపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘బాలా బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలషిస్తున్నాను’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నా’ అంటూ కల్యాణ్‌రామ్ పోస్ట్ చేశారు.