అమనగల్ పోలీస్ స్టేషన్‌లో ‘బక్రీద్’ శాంతి సమావేశం
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు
అమనగల్, మే 14 (విజయక్రాంతి): బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అమనగల్ పోలీస్ స్టేషన్లో గురువారం కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. గో రక్షణ సంఘాల ప్రతినిధులు మరియు హిందూ సంస్థల కార్యకర్తలతో జరిగిన ఈ భేటీలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు అధికారులు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా, అందరూ సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగించే చర్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏదైనా సమాచారం ఉన్నప్పుడు నేరుగా పోలీసులకు తెలియజేయాలి తప్ప, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు.
పశువుల రవాణా మరియు వధకు సంబంధించి ప్రభుత్వం, ఉన్నతాధికారులు జారీ చేసిన తాజా నిబంధనలను ప్రతినిధులకు వివరించారు.సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, శాంతిని దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులు స్పందిస్తూ.. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, పండుగను ప్రశాంతంగా జరుపుకునేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.






