క్రాంతి పురంలో బడిబాట సందడి
20 మంది డ్రాప్‌ఔట్స్‌కు కొత్త బాట
చర్ల, జూన్ 18 (విజయక్రాంతి): చర్ల మండల పరిధిలోని సుబ్బంపేట పంచాయతీ క్రాంతిపురం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా చైతన్యం నింపారు విద్యాధికులు. గ్రామంలో బడికి దూరంగా ఉంటున్న 20 మందికి పైగా డ్రాప్‌ఔట్ విద్యార్థులను తిరిగి బడిబాట పట్టించేందుకు జీహెచ్‌ఎస్ చర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, సుబ్బంపేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఝాన్సీరాణి, సుబ్బంపేట సర్పంచి కాకా సత్యనారాయణ తల్లిదండ్రుల ఇళ్లకు నేరుగా వెళ్లారు.
పిల్లల భవిష్యత్తుకు చదువే సోపానమని, మధ్యలో ఆపొద్దని తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ శ్రేయోభిలాషి, వార్డ్ మెంబర్ ఆంధ్రయ్య సహకారంతో సుబ్బంపేట పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పించి విజయం సాధించారు. ‘ఒక్క పిల్లాడు చదువు మిస్ అయినా గ్రామం నష్టపోతుంది‘ అని హరిప్రసాద్ అన్నారు. బడిబాటతో క్రాంతి పురంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని సర్పంచి సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.






