రైతు వారోత్సవంలో యాంత్రీకరణ, సోలార్ పథకాలపై అవగాహన
చివ్వెంల, మే 7 : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవంలో భాగంగా చివ్వెంల రైతు వేదికలో వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రైతు వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం, డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించారు. యాంత్రీకరణ ద్వారా సాగు వ్యయం, శారీరక శ్రమ తగ్గడంతో పాటు కూలీల కొరతను అధిగమించవచ్చని తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అరుణకుమారి, సునీత రైతులకు తక్కువ యూరియా వినియోగం, పంట మార్పిడి, సేంద్రియ సాగు, నీటి సంరక్షణ వంటి అంశాలపై సూచనలు చేశారు. విద్యుత్ శాఖ డి.ఈ విద్యాసాగర్ PM-కుసుమ్ కాంపోనెంట్-C (IPS) పథకం ద్వారా సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించి రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






