10 March, 2026 | 1:33 PM

తొలి అడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పది’ విద్యార్థుల పరీక్షా సన్నద్ధంపై అవగాహన

10-03-2026 12:00 AM

అన్నపురెడ్డిపల్లి, మార్చి 9 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం లో ఈరోజు తొలి అడుగు ఫౌండేషన్ మరియు మండల విద్యాశాఖఅధికారి  ఉండేటి ఆనంద కుమార్ ఆధ్వర్యంలో మండలం లోని పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష సంసిద్ధత కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. మండలములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఎర్రగుంట, రాజాపురం, అన్నపురెడ్డిపల్లి, తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల బాలురు, తెలంగాణ గిరిజన అభివృద్ధి సంక్షేమ బాలికల పాఠశాల, మరియు కేజీబీవీ అన్నపురెడ్డిపల్లి విద్యా సంస్థలలో చదువుతున్న 287 మంది విద్యార్థులకు పరీక్షల భయాన్ని దూరం చేస్తూ, మానసికంగా, శారీరకంగా ఎలా సిద్ధం కావాలో వివరించారు.

ప్రముఖ సైకాలిజిస్ట్ సుప్రియ మాట్లాడుతూ ఎకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, మొబైల్ ఫోన్ ను ఒక నెల రోజుల పాటు పక్కన పెట్టాలని చెప్పారు. మోటివేషనల్ స్పీకర్ సునీత మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి ఒక గోల్ ను సెట్ చేసుకొని ఆ లక్ష్యం దిశగా పయనించాలని తెలియజేశారు. పదవ తరగతి అనంతరం ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలో కూడా అవగాహన కల్పించారు.  అనంతరం 287 మంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను, స్కెలు, పెన్నులను అందజేశారు.సైకాలజిస్ట్ సుప్రియ కొత్త పల్లి, స్పీకర్ సునీత సి. హెచ్, తొలి అడుగు ఫౌండేషన్ సభ్యులు సౌజన్య స్వాతి, గోపాల్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.