బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
సిద్దిపేట కలెక్టరేట్,(విజయక్రాంతి): బాలల ప్రాథమిక హక్కులను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.సుదర్శన్ అన్నారు. శనివారం సిద్దిపేటలోని టిటిసి భవన్‌లో బాలల హక్కులు, రక్షణ చట్టాలపై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ బాలల సంరక్షణ సమష్టి బాధ్యత అని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు ఉపాధ్యాయులే అత్యంత చేరువగా ఉంటారని, వారి మానసిక స్థితిని గమనిస్తూ సమస్యలను గుర్తించి వెంటనే స్పందించాలని సూచించారు. కుల, మత, వర్ణ, వైకల్య వివక్షకు పిల్లలు గురికాకుండా చూడాలన్నారు. బాలల రక్షణ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు.
జిల్లా మొదటి సెషన్స్ జడ్జి వై.జయప్రసాద్ మాట్లాడుతూ బాలల హక్కులపై ఉపాధ్యాయులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డా.బి.బాలకృష్ణ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ డి.రాజేశం, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాము, న్యాయమూర్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






