28 March, 2026 | 2:34 AM

ఇసుకే ప్రాణం.. తరలిస్తే బతుకం

28-03-2026 12:36 AM

కూడలిలో సీజ్ చేసిన ఇసుక పంపిణీకి యత్నం  

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇవ్వబోయిన అధికారులు

అడ్డుకున్న అక్రమ నిల్వదారులు

తరలిస్తే చనిపోతామంటూ మందు డబ్బా పట్టుకొని బెదిరించిన వైనం

పోలీసులు నిల్వదారులకే వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపణలు 

అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు

మోతె, మార్చి 27 : ఇసుక అక్రమ నిల్వకు ప్రధాన అడ్డా మండల పరిధిలోని కూడలి గ్రామం అనేది అందరి నోటివెంట వినిపించే మాట. అయితే గత నెలలో కూడలిలో అక్రమంగా ఇసుకను నిల్వ చేశారనే సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు గ్రామంలో 18 ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశారు.

ఇదిలా ఉండగా మండలంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరి అయిన లబ్ధిదారులు ఇసుక తొలకానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకుని ఆ ఇసుకను స్థానిక తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో పోయించారు. వీటికి తోడు కూడలిలో సీజ్ చేసిన ఇసుక సైతం అందుబాటులో ఉండగా వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం గుర్తించిన లబ్ధిదారులకు హౌసింగ్. మండల పరిషత్ అధికారులు ప్రొసీడింగ్ ల ఆధారంగా టోకెన్లు అందజేశారు.      

అధికారులను అడ్డుకున్న నిల్వధారులు 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక డంపులను పంపిణీ చేసేందుకు గత బుధవారం రోజున రెవెన్యూ పోలీస్ అధికారులు కూడలి గ్రామానికి వచ్చి ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇసుక తరలిస్తే తాము ఇక్కడే క్రిమిసంహారక మందు తాగి చస్తామంటూ. మందు డబ్బాను చేతిలో పట్టుకొని అధికారులను బెదిరించారు. కొద్దిసేపు అధికారులు, ఇందిరమ్మ లబ్ధిదారులతో ఘర్షణకు దిగారు. ట్రాక్టర్ లో ఎత్తిన ఇసుకను సైతం కింద పోయించారు.            

లబ్ధిదారులు లబోదిబో.. 

రెవిన్యూ అధికారులు టోకెన్లు ఇవ్వడంతోనే అద్దెకు ట్రాక్టర్లను, కూలీలను తీసుకెళ్లామని లబ్ధిదారులు ఇప్పుడు నిల్వదారులు అడ్డుకుంటుంటే అధికారులు చూస్తూ ఊరుకోవడం సరికాదంటూ లబ్ధిదారులు లబోదిబోమంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులు స్థానిక ఎమ్మెల్యే పేరు చెబుతూ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుకను పంపిణీ చేయాలని కోరారు.             

పోలీస్‌ల తీరుపై విమర్శలు..

ఇదిలా ఉండగా లబ్ధిదారులకు ఇసుక పంపిణీ చేసేందుకు గాను అక్కడికి వచ్చిన పోలీసులు ఇసుక నిల్వ చేసిన వారికే మద్దతు పలుకుతున్నారంటూ అక్కడికి వచ్చిన పలువురు లబ్ధిదారులు విమర్శలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక్కడే ఉంటే నిల్వదారులు ట్రాక్టర్లను ధ్వంసం చేస్తారని వెళ్లిపోవాలంటూ వెనక్కి పంపించేసిన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది

 అధికారుల తీరుపై అనుమానాలెన్నో..!

ఫిబ్రవరి నెలలో కూడలి గ్రామంలో 18 ఇసుక డంపులను సీజ్ చేసిన అధికారులు ఇప్పటివరకు వాటిని పరిశీలించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క మండలాల్లో దొరికిన డంపులను సీజ్ చేసి వేలంపాటలు వేస్తుంటే మండలంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు అడుగు బయట పెట్టకాపోవడంతో అక్రమ ఇసుక వ్యాపారులు యధేచ్చగా దందా కొనసాగిస్తున్నారని స్థానికంగా  బలంగా వినిపిస్తుంది. అధికారులకు అక్రమార్కులు ముడుపులు అందించడం వలననే వారు సరిగా స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ముడుపులు అందడంతో లబ్ధిదారుల ట్రాక్టర్లను వెళ్ళిపోవాలని బలవంతంగా వెనక్కి పంపించినట్లు గ్రామస్తులే చెబుతుండటం ఆశ్చర్యకరం. అయితే ఈ ఇసుక డంపుల విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలిసింది.  మండల అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు కలిసి కుమ్మకై కావాలనే ఇలా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుకను పంపిణీ చేసి వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

లబ్ధిదారులకు అందజేస్తాం                     

 అక్రమంగా నిల్వలు చేసిన ఇసుకను తప్పక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేస్తాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. లబ్ధిదారులు ఎవరు కంగారు పడవద్దు.

-వెంకన్న, తాసిల్దార్, మోతె