మద్యం మత్తులో దుండగుల దాడులు
కొల్చారం(విజయక్రాంతి): కొల్చారం మండలం ఏడుపాయల టి జంక్షన్ ప్రాంతం రాత్రి వేళల్లో రణరంగాన్ని తలపిస్తోంది. ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని మాతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మద్యం మత్తులో ఉన్న కొందరు దుండగులు భక్తులను వెంటపడి కర్రలతో దాడులు చేస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక హోటళ్ల యాజమాన్యాలు నాసిరకమైన, కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తూ భక్తులను మోసం చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆహార నాణ్యతపై ప్రశ్నిస్తే, బౌన్సర్లను పెట్టుకొని భక్తులపై దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన భక్తులు కొత్తగా కొనుగోలు చేసిన బుల్లెట్ బండికి పూజ చేయించుకొని తిరుగు ప్రయాణంలో ఒక హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్లారు. అక్కడ ఆహారం నాణ్యతపై ప్రశ్నించగా, కొందరు దుండగులు హోటల్ నుండి కర్రలు తీసుకొని వారిపై దాడి చేశారు. ఈ దాడిలో భక్తులు గాయపడగా, వారు తీసుకొచ్చిన బుల్లెట్ బండిని కూడా ధ్వంసం చేశారు. తీవ్ర రక్తస్రావంతో భక్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తూ చేసిన ఆర్తనాధాల వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
అయినప్పటికీ, ఏడుపాయల దుర్గామాతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సరైన భద్రత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉండటం వల్ల మద్యం సేవించి దుండగులు భక్తులను భయపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాత్రి సమయంలో నిర్ణీత సమయానికి హోటల్ లు మూసి వేసేలా చూడడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏడుపాయలకు వచ్చే యాత్రికులు కోరుతున్నారు.






