బేకరీలను తనిఖీ చేసిన ఆహార భద్రత శాఖ
ఆలేరు,(విజయక్రాంతి): బేకరీలను తనిఖీ చేసిన, ఆహార భద్రత శాఖ, నల్గొండ జిల్లా & యాదాద్రి భువనగిరి జిల్లా (ఇన్‌చార్జ్) ఆలేరు పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నల్గొండ జిల్లా మరియు యాదాద్రి భువనగిరి జిల్లా (ఇన్‌చార్జ్) శ్రీ ఎన్. శివ శంకర్ రెడ్డి ఘటన జరిగిన బేకరీలను బాధితుడి సమక్షంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యిందని అనుమానిస్తున్న చెకోడీలను పరిశీలించగా, గడువు తేదీ లోపల ఉన్నప్పటికీ వాటి నుండి రాన్సిడ్ (దుర్వాసన) వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం అనుమానిత ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపారు.
ల్యాబ్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలోని మొత్తం 5 బేకరీలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాటిలో శ్రీధర్ బేకరీ, శ్రీ మారుతి బెంగళూరు అయ్యంగార్ బేకరీ, కేక్ హౌస్, ఏ ఎస్ కె, బెంగళూరు అయ్యంగార్ బేకరీలను తనిఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీలలో కేక్ హౌస్, శ్రీ మారుతి బెంగళూరు అయ్యంగార్ బేకరీ మరియు శ్రీధర్ బేకరీలలో గడువు తీరిన మరియు నాసిరకం ఆహార పదార్థాలు గుర్తించినట్లు వెల్లడించారు. అదేవిధంగా గడువు తీరిన 47 డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీటిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ యాక్ట్ -2026) నిబంధనల మేరకు సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో స్వాధీనం చేసుకున్న సుమారు 15 కిలోల గడువు ముగిసిన మరియు కలుషితమైన ఆహార పదార్థాలను అధికారుల సమక్షంలో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీ ఎన్. శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలలో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వ్యాపారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వెంటనే తొలగించాలని,
నిల్వ చేసే పదార్థాలపై తయారీ, గడువు తేదీలను స్పష్టంగా ప్రదర్శించాలని, పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆహార తయారీ, విక్రయాలు నిర్వహించాలని, వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని సూచించారు. ప్రజలకు కూడా ప్యాకెట్ ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా పరిశీలించాలని, దుర్వాసన, రుచి మార్పు లేదా అనుమానాస్పదంగా అనిపించే ఆహార పదార్థాలను వినియోగించవద్దని సూచించారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.






