24 February, 2026 | 9:39 PM

రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాల అంచనా

24-02-2026 07:33 PM

ఈనెల 25 నుంచి 27 వరకు 53 పాఠశాలల్లో ఆన్‌లైన్ అసెస్‌మెంట్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎఫ్‌ఎల్‌ఎన్ (Foundational Literacy & Numeracy) స్టడీలో భాగంగా జిల్లాలోని రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాల అంచనాకు ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఆన్‌లైన్ అసెస్‌మెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఎంపికైన 53 పాఠశాలల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల ద్వారా ఈ అసెస్‌మెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించి రాజేంద్ర ప్రసాద్ బి.ఎడ్ కళాశాల, శ్రీనిధి టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఆసిఫాబాద్)ల నుంచి డి.ఎడ్, బి.ఎడ్ విద్యార్థులలో 53 మందిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా ఎంపిక చేసి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఈ నెల 25న తెలుగు/ఉర్దూ, 26 న గణితం, 27 న ఆంగ్లం సబ్జెక్టులలో సర్వే నిర్వహించబడుతుందని తెలిపారు.

శిక్షణ పొందిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు టాన్జరిన్ యాప్ ద్వారా పూర్తిగా పారదర్శకంగా రెండో తరగతి విద్యార్థుల ప్రగతిని అంచనా వేయాలని సూచించారు. ఎంపికైన 53 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్వే జరిగే మూడు రోజులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, అలాగే రెండో తరగతి విద్యార్థులు 100 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు ప్రశాంత్, వినయ్, రూమ్ టు రీడ్ ఇండియా జిల్లా ఇన్‌చార్జ్ మధు, స్థానిక కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.