24 June, 2026 | 6:11 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలి

24-06-2026 05:00 PM

 ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే మహమ్మారిలాంటివని, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి పోరాదని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు.జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే విజయాలు సాధించగలరని చెప్పారు.

మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలు, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించారు.డ్రగ్స్ కొనుగోలు, విక్రయం, వినియోగం చట్టరీత్యా నేరమని, ఎవరైనా మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిసిన వెంటనే డయల్-112కు లేదా సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం డీఎస్పీ  విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి విద్యాభ్యాసం, వసతి, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.