19-02-2026 12:20:23 AM
బ్రిటిష్ పాలనను తలపిస్తున్న టి.జి.ఎన్.పి.డి.సి.ఎల్ డ్యూటీలు
ఒక్కో ఆర్టిజన్ 48 గంటల విధులు
సిబ్బంది నియామకాలు లేవు
వేల కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయిలు
అశ్వారావుపేట, ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ని విద్యుత్ పంపిణీ సంస్థలు సబ్ స్టేషన్లలో పని చేసే ఆర్టిజన్ లతో గొడ్డు చాకిరి చూపిస్తున్నారని చెప్పచ్చు. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సబ్ డివిజన్ ని పరిశీలిస్తే 15 సబ్ స్టేషన్లలో సుమారు 20 మంది ఆర్టిజన్ లతో విధులు నిర్వర్తింపజేస్తున్నారు. ఒక్కో ఆర్టిజన్ రెండు రోజుల పాటు ఎక చిత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. సంస్థ నిబంధనల ప్రకారం ఒక్కో సబ్ స్టేషన్ కు నలుగురు ఆర్టిజన్ లు ఉండాలి ఒక్కో ఆర్టిజన్ రోజుకు 8 గంటలకు మించి విధులు నిర్వహించకూడదు. కానీ టీ. జి.ఎన్.పి.డి.సి.ఎల్ . ఒక్కో ఆర్టిజన్ తో రెండు రోజులకు తక్కువ కాకుండా డ్యూటీలు చేసే పరిస్థితి నెలకొంది.
బ్రిటిష్ కాలం లో కూడా అంత దారుణంగా చాకిరి చేయించలేదని కొందరు వాపోతున్నారు. ఆర్టిజన్ లే కాకుండా జె ఎల్ ఎం లు, ఎ ఎల్ ఎమ్ ల చేత కూడా సబ్ స్టేషన్ డ్యూటీలు చూపిస్తున్నారు. జె ఎల్ ఎం లు, ఎ ఎల్ ఎం లు సబ్ స్టేషన్ డ్యూటీ పూర్తి కాగానే తన రోజు వారి విధులకు హాజరు కావలసి ఉంటుంది. ఈ విధంగా రెండు రకాల. విధులు నిర్వహించడంతో వారు అనారోగ్యం పాలవుతున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాల చట్టం ను విద్యుత్ సంస్థలు తుంగలో తొక్కాయి.
ఇంకో విషయం ఏమిటంటే అశ్వారావుపేట సబ్ డివిజన్ పరిధిలో అధికారులు, సిబ్బందికి బదిలీ అయితే వారిని రిలీవ్ చేయడమే తప్ప వారి స్థానం లో మరో అధికారి గాని, సిబ్బంది గానీ నియమించటం లేదు. దీంతో సబ్ డివిజన్ పరిధిలో క్షేత్ర స్థాయి పనులు, కార్యాలయ పనులు కుంటుపడుతున్నాయి. ఎ ఎల్ ఎం లకు కూడా సబ్ స్టేషన్ డ్యూటీలు వేయడంతో వ్యవసాయ, గృహ వినియోగదారులు ఫీజులు పోయిన, విద్యుత్ తీగలు తెగిన ప్రవేటు వ్యక్తులపై ఆధారపడాల్సిన వస్తుంది. ప్రవేటు వ్యక్తులకు ఎంతో కొంత ముట్ట జెప్పందే పనులు జరగటం లేదు.
విద్యుత్ పంపిణీ సంస్థలు కొత్త నియామకాలు చెప్పటకోవడంతో ఉన్న సిబ్బందితో పబ్బం గడుపుతున్నారు అధికారులు. ప్రభుత్వం నుండి వేల కోట్ల రూపాయలు బకాయిలు రాకపోవడంతో, ఆర్ధిక వనరులు లేక కొత్త నియామకాలు చేపట్టటం లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అప్పుల్లో నుండి సంస్థ బయట పడేది ఎప్పుడో నిధులు చేకూరేది ఎపుడో ఆ భగవంతుడుకే తెలియాలి. దీనిపై అశ్వారావుపేట సబ్ డివిజన్ ఏడిఈఈ వెంకట రత్నంను వివరణ కోరగా సబ్ స్టేషన్ లలో ఆపరేటర్ల కొరత ఉన్న మాట వాస్తవమే అని, సంస్థ కొత్త నియామకాలు చేపడితే సిబ్బంది వస్తారని తెలిపారు.