31 August, 2026 | 2:47 AM

ఆదర్శవంతంగా అర్పణపల్లి

31-08-2026 01:52 AM

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి 

కేసముద్రం, ఆగస్టు 30(విజయక్రాంతి): అర్పణ పల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా నని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. సోమవారం కేసముద్రం పట్టణంలో నిర్వహించే వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల నేపథ్యంలో కేసముద్రం పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన అర్పణ పల్లిలో చేపట్టిన వట్టి వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణ పనులతో పాటు పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడ కూడా నాణ్యతలో రాజీ పడవద్దని, వట్టి వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇక వర్షాకాలంలో రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పై గ్రామస్తులతో సమీక్షించారు. గ్రామంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ఆలయ నిర్మాణం, జంక్షన్ అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. అర్పణ పల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రజలంతా సమిష్టిగా ముందుకు సాగాలని కోరారు.