8 June, 2026 | 3:49 AM

పత్తి విత్తనాలు నాణ్యమైనవేనా?

08-06-2026 12:30 AM
  1. తూతూ మంత్రంగా తనిఖీలు
  2. నిబంధనలను పాటించని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణదారులు

కల్వకుర్తి, జూన్7: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.  తొలకరిలో విత్తనాలు వేస్తే మంచి దిగుబడి వస్తుందనే ఆశతో ఆయా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాల బాట పడుతున్నారు. అయితే మార్కెట్లో విక్రయిస్తున్న విత్తనాల నాణ్యతపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి ఏడాది అధిక ధరలు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేస్తున్నా రైతులు నకిలీ విత్తనాల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి తగ్గిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు విత్తన దుకాణాల్లో కేవలం నామమాత్రపు తనిఖీలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు గత వారం రోజులుగా జిల్లాలోని ఆయా దుకాణాల్లో తనికీలు చేపట్టినట్లు ఫోటోలకు ఫోజులు దిగారు.

నిబంధనలకు విరుద్ధంగా రికార్డులను నమోదు చేయకపోయినా స్టాక్ వివరా లను పొందుపరచలేకపోయిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక భారీగా ముడుపులందయాన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆయా కంపెనీల విత్తన ప్యాకెట్లతో పాటు సంబంధంలేని క్వాలిటీ లేని విత్తన ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అయినా వాటిని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదిగిన ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణాదారుల వద్ద లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వారిని పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. 

పత్తి సాగుపై రైతన్న ఆసక్తి

గతేడాది అధిక వర్షాలతో పత్తి పంట పూర్తిగా నష్టపోయిన రైతాంగం ఈసారైనా అధిక దిగుబడి సాధించేందుకు ఆశ పడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలో అధికంగా పత్తి సాగు చేస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానికంగా ఉంటూ ఎలాంటి నిబంధనలు పాటించకుండానే విత్తనాలు విక్రాయిస్తున్నారు. గ్రామాల్లోనూ ఎరువుల దుకాణాలు దర్శనమిస్తున్నాయి. 

అధికారులు మాత్రం రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి హడావిడి చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ద్వారా పెద్దగా ఫలితాలు కనిపించ లేదని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వివిధ కంపెనీల పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్లో, సరైన ప్రమాణాలు లేకుండానే కొన్ని విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయని ఆరోప ణలు ఉన్నాయి.

డిమాండ్ ఉన్న బ్రాండ్ల విత్తనాలను కొందరు వ్యాపారులు దాచిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.  ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే తక్కువ ధరలకు విక్రయిస్తున్న విత్తనాల నాణ్యతపై కూడా రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కంపెనీలు విస్తృత ప్రచారం చేయడంతో రైతులు ఆయా బ్రాండ్ల కోసం దుకాణాల వద్ద వెతుకులాడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించి, గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాలు, అధిక లాభాల కోసం నాణ్యతలేని విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.