1 August, 2026 | 2:45 AM

జనన మరణాల బిల్లుకు ఆమోదం

01-08-2026 01:45 AM

గందరగోళం మధ్య లోక్‌సభలోకి సవరణ బిల్లు

విద్యార్థులపై లాఠీచార్జిపై చర్చకు విపక్షాల డిమాండ్

చర్చ లేకుండానే బిల్లు ఆమోదం

పెద్దలసభలోనూ విపక్షాల నిరసన హోరు

ఉభయ సభలు ౩వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ, జూలై ౩౧: ఉభయ సభల్లో శుక్రవారం పదోరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ‘జనన మరణాల నమోదు సవరణ  2026 బిల్లు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జి, నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య రామ్‌మందిరం నిధుల దుర్వినియోగంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, వెల్ వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. చర్చలో భాగస్వాములు కాకుండా సభను అడ్డుకోవడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల తీరు విచారకరమని వాపోయారు. సభ్యులంతా స్పీకర్ ఓంబిర్లా సభ నిర్వహణకు సహకరించాలని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం ౧౨ గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే జనన మరణాల నమోదు సవరణ బిల్లు సభ ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా నిరసనలు కొనసాగడంతో సభాపతి సభను 3వ తేదీకి వాయిదా వేశారు.

అయితే, ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. తిరిగి ౩వ తేదీ సభ ప్రారంభమైన తర్వాత బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. మరోవైపు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌పై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్) నోటీసు ఇచ్చారు. గతనెల 20న ఢిల్లీలో సీజేపీ నేతలు, విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్’ నిరసనలో ఎలాంటి కాల్పులు, లాఠీచార్జి జరగలేదని కేంద్ర మంత్రి సభావేదికగా పేర్కొన్నారని, తద్వారా సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని ఆయన తప్పుబట్టారు.

రాజ్యసభలోనూ హైడ్రామా

రాజ్యసభలోనూ విపక్షాలు ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జిపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. సభా కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి, వెంటనే లాఠీచార్జి అంశంపై చర్చ పెట్టాలని చైర్మన్ రాధాకృష్ణన్‌కు విపక్షనేత మల్లికార్జున ఖర్గే రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చారు. ‘దేశ చరిత్రలో ఇంతవరకూ ఎన్నడూ జరగని విధంగా విద్యార్థులపై లాఠీచార్జి, అణచివేత జరిగింది. విద్యార్థినులను పోలీసులు ఈడ్చుకెళ్లారు.

అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులు ఆందోళనను ఉపసంహరించుకుంటే చట్టపరమైన చర్యలు ఉండవని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి. విద్యార్థుల నిర్బంధమూ జరుగుతున్నది’ అని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఖర్గే ఇచ్చిన నోటీసు చెల్లదని చైర్మన్ రాధాకృష్ణన్ కొట్టిపడేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ పలుమార్లు వాయిదా పడింది. చివరకు చైర్మన్ సభను ౩వ తేదీకి వాయిదా వేశారు.