8 May, 2026 | 4:33 AM

లెఫ్ట్ ప్రస్థానంలో మరో అధ్యాయం

08-05-2026 12:00 AM

కేరళంలో వెలువడిన ఎన్నికల ఫలితా లు ఆఒక్క రాష్ట్రాన్ని మాత్రమే ప్రభావితం చేయలేదు, అవి భారత రాజకీయ చరి త్రలో ఒక మహా అధ్యాయానికి ముగింపు పలికాయి. పినరాయి విజయన్ ముఖ్యమం త్రి పదవికి రాజీనామా చేయడంతో దశా బ్దం పాటు కొనసాగిన ఆయన పాలనకు తెరపడింది. ఈ ఓటమి కేరళంలో కమ్యూనిస్టు పాలనతో పాటు దేశంలో లెఫ్ట్ పాలన కూడా ముగిసేలా చేసింది. 1977 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో కనీసం ఒక్క రాష్ట్రమైనా కమ్యూనిస్టు పాలనలో ఉండేది. ఇప్పుడు ఆ స్థితి మొదటిసారి మారిపోయిం ది. స్వాతంత్య్రానికి పూర్వం అంకురించి, స్వాతంత్య్రానంతరం పల్లవించి, కోట్లాది కార్మికులకు, రైతులకు ఆశాజ్యోతిగా నిలిచిన ఎర్రజెండా.. ఇప్పుడు ఏ అధికార సౌధంపైన ఎగరడం లేదు.

కమ్యూనిస్టు ఉద్యమం దేశంలో పార్టీ రాజకీయంగా మాత్రమే ప్రారంభం కాలేదు. అది ఒక సామాజిక చలనంగా, వర్గపోరాటంగా, జీవన విధానంగా పుట్టింది. 1946 నుంచి 1951 వరకు తెలంగాణలో సాయుధ రైతు పోరాటాన్ని నడిపించింది. భూస్వాములకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని నిర్వ హించింది. 1950, 1960లలో పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని అలంకరించింది. ఈ క్రమంలో అత్యంత చరిత్రాత్మక ఘట్టం 1957లో జరిగింది.

కేరళంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య పద్ధతి లో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిం ది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జాతీయస్థాయి లో వారి శిఖరం ఏమిటంటే.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో 43 స్థానాలు గెలుపొందడం. అయితే, 2007లో మన్మోహన్‌సింగ్ ప్రభు త్వం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ముందుకు వెళ్లినప్పుడు, లోక్‌సభ లో 62 స్థానాలతో కమ్యూనిస్టులే ప్రభుత్వా న్ని నిలబెట్టే స్థితిలో ఉన్నారు. ఒక అగ్రరాజ్యానికి సంకేతం పంపగల శక్తి వారి చేతిలో ఉంది. ఆ అణు ఒప్పందంపై మద్దతు ఉపసంహరణే వారి పతనానికి ఒక పెద్ద మలు పు అయింది.

కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం.. జాతీ య రాజకీయంలో వారి ప్రభావం అత్యున్నత స్థాయిలో ఉన్న తరుణంలో క్రమంగా వారిని అప్రాసంగికత వైపు నెట్టింది. ఆ తర్వాత 2011లో మమతా బెనర్జీ తుఫాన్ ముందు బెంగాల్‌లోని కమ్యూనిస్టుల కోట కుప్పకూలిపోయింది. ఆ ఓటమి తర్వాత వామపక్షాలు మళ్లీ కోలుకోలేదు. మరోవైపు త్రిపురలో 1993 నుంచి 2018 వరకు వామపక్షాలు పాలించాయి.2018లో బీజేపీ కూట మి ముందు లెఫ్ట్ నిలువలేకపోయింది. ఈ క్రమంలో కేరళం మాత్రమే వారికి ఒక ఆశాదీపంగా మిగిలింది. అక్కడ యూడీఎఫ్, ఎల్డీ ఎఫ్ మధ్య ఊగిసలాడే రాజకీయం కమ్యూనిస్టులను సజీవంగా ఉంచింది. కానీ, ఇప్పు డు యూడీఎఫ్ 140 స్థానాలకుగాను 98 స్థానాల్లో గెలుపొందగా, లెఫ్ట్ 35 స్థానాలకే పరిమితమైంది.

పార్లమెంటరీ కమ్యూనిజం పతనమవుతున్న ఈ కీలక సమయంలోనే, అడవుల్లో సాయుధ విప్లవం కలగన్న మావోయిస్టు ఉద్యమం కూడా దాదాపు అంతరించే దశకు చేరుకుంది. ఒక వైపు ఎన్నికల రాజకీయంలో కమ్యూనిస్టులు ఓడిపోవ డం, మరోవైపు అడవుల్లో సాయుధ విప్లవకారులు లొంగిపోవడం.. ఈ రెండు పరిణా మాలు ఒకే సమయంలో జరగడం కాకతాళీయం కాదు. దేశంలో వామపక్ష ఆదర్శం రెండు రూపాల్లోనూ ఏకకాలంలో వెనుతిరుగుతోంది.

సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు తమ భావజాల అప్రాసంగికత సమస్యను ఎదుర్కొన్నాయి. భారత్‌లోనూ ఆర్థిక సరళీకరణ తర్వాత మధ్యతరగతి ఆకాంక్షలు, యువత అభీష్టాలు మారిపోయాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్యూనిస్టు భావజా లం క్రమంగా ఆకర్షణ కోల్పోవడం వారి ఎన్నికల ప్రాతినిధ్యం తగ్గడానికి కారణమైం ది. బెంగాల్‌లో రైతుల భూమిని పారిశ్రామి క అవసరాలకు బలవంతంగా సేకరించిన సింగూర్ నిర్ణయాలు.. కార్మిక, రైతు వర్గాల పార్టీగా చెప్పుకొన్న వారికి శరాఘాతమయ్యాయి.

దీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వంలో ఉన్న సీతా రాం ఏచూరి 2024లో మరణించడం ఆ పార్టీకి తీరని లోటు అని చెప్పాలి. జ్యోతిబ సు, ఈఎంఎస్ స్థాయి నాయకులను తదుపరి తరం భర్తీ చేయలేకపోయింది. కాంగ్రెస్ ను ప్రతిపక్షంగా ఎదుర్కొన్న కమ్యూనిస్టులు, బీజేపీ అనే శక్తివంతమైన సైద్ధాంతిక శత్రువు ముందు నిలవలేకపోయారు. కమ్యూనిస్టు పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యూహంలో భాగంగా విపక్ష కూటమిలో చేరాయి. స్వతంత్ర పాలన నుంచి సహాయక పాత్రకు మారాయి.

కేరళంను మిగతా రాష్ట్రా ల కమ్యూనిస్టు పాలనతో పోల్చడం న్యాయం కాదు. కేరళం అభివృద్ధి నమూనా అంటే.. అక్షరాస్యత, ఆరోగ్య సేవలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత. ఇవి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కొవిడ్- మహమ్మారి సమయంలో పినరా యి ప్రభుత్వం అనుసరించిన వ్యూహం దేశానికి ఆదర్శంగా నిలిచింది. అయినప్పటికీ, కేరళ రాజకీయాల విలక్షణత ఏమిటంటే.. అక్కడ ప్రతి ఐదేళ్లకు అధికార మార్పు జరగడం. కేరళం రాజకీయ చరిత్రను బట్టి, తదు పరి ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి తిరిగి అధికారంలోకి రావచ్చు. కానీ, ప్రశ్న ఏమిటంటే.. ఆ రాక జాతీయ స్థాయిలో ఏమాత్రం అర్థవంతమైనదిగా ఉంటుందా?

కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా పతనమైపోయిందని ప్రకటించడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే, ఈ దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గలేదు, కార్మికుల హక్కుల పై దాడులు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. మార్క్సిస్టు సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజాస్వామ్య విప్లవం ద్వారా భారత సమాజాన్ని పరివర్తన చెందించాలనేది కమ్యూనిస్టు పార్టీ ఆశయం. ఆ ఆశయం నేటికీ కాగితాలపై ఉంది. కానీ, ప్రజల హృదయాలలో స్థానం కోల్పోవడమే అసలు సమస్య.

ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ ముందున్న ఎంపికలు రెండే.. పరివర్తన లేదా పతనం. భావజాలాన్ని వదలకుండానే నేటి యువత, నేటి సమస్యలతో అనుసంధానం చేసుకోవడం అవసరం. కార్మిక హక్కులు, వాతావరణ సంక్షోభం, కార్పొరేట్ అధిపత్యం, ఆదివాసీ హక్కులు.. ఇవి నేటి తీవ్ర సమస్యలు. వీటిపై పోరులో ముందు నిలబడగలిగితే, కమ్యూనిస్టులు మళ్లీ పుంజుకోవచ్చు.

కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకపోవడాన్ని నిజంగా భారత్‌లో వామపక్షానికి కాలం చెల్లినట్టుగా భావించవచ్చా? అంటే సమాధానం చెప్పడం అంత సులువు కాదు. 1957లో నంబూద్రిపాద్ ప్రభుత్వా న్ని నెహ్రూ రద్దు చేసినప్పుడు, ఒక నేత ఇలా అన్నారట: ‘ఈ ఓటమి తాత్కాలికం, ఆశ యం శాశ్వతం’. కానీ, ఆశయం మాత్రమే ఉంటే సరిపోదు.. ఆ ఆశయాన్ని నేటి భాష లో, నేటి సమాజానికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే నాయకత్వం కావాలి. ఎర్రజెండా వెలిసింది.. కానీ, అది పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదు. ఒక యుగం ముగిసింది. కొత్త అధ్యాయం మొదలవుతుందో, లేదో కాలమే చెప్పాలి.

వ్యాసకర్త: జర్నలిస్ట్, 9010128884

కాలగిరి శ్రీనివాస్‌రెడ్డి