అన్నా.. పోలీసుల ఎదుట లొంగిపో
- జనజీవన స్రవంతిలో కలువు
అజ్ఞాతంలో ఉన్న గణపతిని కోరిన తమ్ముడు రామచంద్రరావు
అంతుచిక్కని గణపతి ఆచూకీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం చరమాంకానికి చేరుకుం టున్న వేళ.. ఆ పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆచూకీ అంతుచిక్కని రహస్యంగా మారింది. ఒకవైపు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కాగార్ దెబ్బకు మావోయిస్టు అగ్రనేత లు ఒక్కొక్కరుగా తుపాకీ కిందపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.
దశాబ్దాల పాటు దండకారణ్యాన్ని గుప్పెట్లో పెట్టుకున్న నాయకులు సైతం లొంగిపోతుండటంతో.. అసలు గణపతి ఎక్కడున్నారు.. అన్న చర్చ సర్వత్రా తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో వద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న తన అన్న గణపతి తక్షణమే పోలీసుల ఎదు ట లొంగిపోయి, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆయన సోదరుడు రామచంద్రరావు మీడియా ద్వారా భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేతలు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, బడే చొక్కారావు అలియాస్ సాగర్తో పాటు సుమారు 20 మంది కీలక మావోయిస్టులు ఇటీవల పోలీసులకు సరెండర్ అయిన విషయం విధిత మే. దశాబ్దాలుగా అడవికి పరిమితమైన వారంతా బయటకు వస్తున్న క్రమంలో.. గణపతి సోదరుడు రామచంద్రరావు స్పం దించారు. ‘అన్నా.. నీతో కలిసి అడవిలో దశాబ్దాల పాటు పనిచేసిన వారంతా ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారు.
నీ ఆరోగ్యం కూడా ఏమాత్రం సహకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా ఆయు ధం వీడి బయటకు రావాలి. నీ రాక కోసం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు’ అని ఆయన విన్నవించారు. అలాగే, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో గణపతిపై కేసులు ఉ న్నాయని, ఆయన గనుక లొంగిపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనపై ఉన్న కేసులన్నీ బేషరతుగా ఎత్తివేసి క్షమాభిక్ష ప్రసాదించాలని రామచంద్రరావు కోరారు. గణపతి తన వయసు, అనారోగ్య కారణాల దష్ట్యా 2018 లోనే పార్టీ పగ్గాలను నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్కు అప్పగించారు.
అప్ప టి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అబూజ్‌మడ్ అడవుల్లోనే ఉంటూ పార్టీకి దిశానిర్దేశం చేశారు. గత రెండేళ్లలో పోలీసుల ఎన్కౌంటర్లలో ఎంతోమంది కీలక నేతలు హతమైనా, లొంగిపోయినా గణపతి జాడ మాత్రం భద్రతా బలగాలకు చిక్కలేదు. లొంగిపోయి న అగ్రనేతలను విచారించినప్పటికీ ఎస్‌ఐబీ పోలీసులకు ఆయన ఆచూకీపై కచ్చితమైన సమాచారం లభించలేదు. అయితే, 2024 జులై 13 నుంచి ఆగస్టు 10 వరకు అబూజ్మడ్‌అడవుల్లో జరిగిన పొలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుల కీలక సమావేశంలో గణపతి పాల్గొన్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. ఆ తర్వాతే ఆయన అదశ్యమయ్యారు.
ఫిలిప్పీన్స్‌లో గణపతి!
ఆగస్టు సమావేశాల అనంతరం భద్రతా బలగాల పహారాను దాటుకొని గణపతి విదేశాలకు వెళ్లిపోయి ఉంటారన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఝా ర్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ మీదుగా నేపాల్‌కు.. అక్కడి నుంచి నేరుగా ఫిలిప్పీన్స్ చేరుకొని ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దక్షిణాసియాలోని విప్లవ పార్టీల కూటమి అయిన కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మావోయిస్టు పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సౌత్ ఏషియాతో భారత మావోయిస్టు పార్టీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నా యి.
నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, ఫిలిప్పీన్స్‌లోని విప్లవ సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ నెట్వర్క్ సాయంతోనే ఆయన ఫిలిప్పీన్స్ వెళ్లి తలదాచుకొని ఉంటారని ఇంటెలిజెన్స్ అం చనా వేస్తోంది. మరోవైపు, దేశం విడిచి వెళ్లేంత ఆరోగ్యంగా ఆయన లేరని, దేశంలోనే ఏదైనా సురక్షితమైన అర్బన్ షెల్టర్ పట్టణ ప్రాంతాల్లోని రహస్య స్థావరంలో మారుపేరుతో వైద్యం చేయించుకుంటూ ఉండి ఉంటారన్న ప్రచారం కూడా సాగుతోంది.




