రాహుల్ గాంధీతో అనిల్ కుమార్ ప్రత్యేక సమావేశం
శేరిలింగంపల్లి నియోజకవర్గంపై హైకమాండ్ దృష్టి
శేరిలింగంపల్లి, మే 29 (విజయక్రాంతి): లోక్సభ ప్రధాన విపక్ష నాయకులు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మరబోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ తన తండ్రి స్వర్గీయ సత్యనారాయణ యాదవ్ పార్టీకి చేసిన సేవలను రాహుల్ గాంధీకి వివరంగా తెలియజేశారు.
2018లో శేరిలింగంపల్లిలో జరిగిన బహిరంగ సభకు సంబంధించిన విషయాలను కూడా చర్చించారు. స్థానిక సమస్యలు, నియోజకవర్గం అభివృద్ధి, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అనేక అంశాలపై రాహుల్ గాంధీ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేపట్టారు. రానున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది.
ఈ క్రమంలో హైటెక్ సిటీ సమీపంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు గుర్తు చేశారు. భారత భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలవడం, స్థానిక విషయాలపై నేరుగా చర్చించడం చాలా సంతోషంగా ఉందని,నాపై మరింత బాధ్యతను పెంచింది అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనిల్ కుమార్ యాదవ్కు ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.






