06-02-2026 06:40:15 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికి తీయడం లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రధాన్ మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా నేడు చారిత్రక జిమ్ఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి ఫైనల్ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ రాకేష్ బురుగుల నాయకత్వంలో అమీర్‌పేట్‌కు చెందిన ‘సాఫ్రన్ వారియర్స్’ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థులను ఓడించి చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
పోటీలంతటా ఆటగాళ్లు చూపిన క్రీడాస్ఫూర్తి, సమన్వయం, పట్టుదల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ టోర్నమెంట్‌కు క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభించగా, యువతలో ఆరోగ్యం, ఐక్యత, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు.విజేతలైన సాఫ్రన్ వారియర్స్ జట్టును, ముఖ్యంగా జట్టు కెప్టెన్ రాకేష్ బురుగులను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందిస్తూ, పోటీల్లో పాల్గొన్న అన్ని జట్లను, ఆటగాళ్లను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.