calender_icon.png 6 February, 2026 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జాతీయ కీర్తి

06-02-2026 06:36:32 PM

సాంకేతికతతో గుర్తింపు… సేవతో పరిష్కారం

సి ఈ ఎల్ ఆర్ తో విశిష్ట విజయం సాధించిన జిల్లా పోలీసులు

78% మొబైల్ రికవరీ రేటుతో దక్షిణాది రాష్ట్రాలలో మొదటి స్థానం

జిల్లా పోలీసుల పనితీరును ప్రశంసించిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ రికవరీలో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి విశిష్ట ఘనతను తమ ఖాతాలో వేసుకున్నారు. సిఎల్ఆర్ (Central Equipment Identity Register) వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ 78 శాతం మొబైల్ రికవరీ రేటు సాధించి, దక్షిణాది రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో నిలవడం జిల్లా పోలీస్ యంత్రాంగం గర్వకారణమైన విజయం సాధించారు. జిల్లాలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ట్రాకింగ్ విధానాలు, సిఎల్ఆర్ అప్లికేషన్‌ను సమర్థంగా ఉపయోగించడం ద్వారా ఇప్పటివరకు మొత్తం 2,286 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేస్తూ 78 శాతం రికవరీ రేటు సాధించడం విశేషం.

ఈ అద్భుతమైన పనితీరుతో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్. జిల్లా పోలీస్ అధికారులను అభినందిస్తూ ప్రశంసలు కురిపించి, హర్షం వ్యక్తం చేశారు. మొబైల్ రికవరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖ,న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా లెవెల్‌లో మొదటి స్థానం జిల్లా పోలీసులకు దక్కడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన కేరళ లోని ఎర్నాకులంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సుకు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే హాజరై, సిఎల్ఆర్. ద్వారా మొబైల్ ఫోన్ రికవరీలో అనుసరించిన ఉత్తమ విధానాలు, కార్యాచరణ వ్యూహాలు, విజయవంతమైన అనుభవాలను కాన్ఫరెన్స్‌లో వివరించి అవార్డును స్వీకరించనున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ... మొబైల్ ఫోన్ రికవరీలో ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడం, దక్షిణాది రాష్ట్రాలలో మొదటి స్థానం సాధించడం తెలంగాణ పోలీసుల పనితీరు, నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యతాయుతంగా, తక్షణ స్పందనతో వ్యవహరించడం, వంటి ఆధునిక డిజిటల్ వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించడం, సాంకేతిక నైపుణ్యంతో ట్రాకింగ్ నిర్వహించడం వల్లే ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా తక్షణమే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు పోర్టల్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

మొబైల్ ఫోన్ రికవరీలో విశేష ప్రతిభ కనబర్చిన ఐటీ కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలను అందించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగిస్తూ, ప్రజల నమ్మకాన్ని బలపరచే విధంగా పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని ఎస్పీ తెలిపారు.