15 April, 2026 | 2:36 AM

విద్యతోనే వివక్షతలు అంతం

14-04-2026 09:40 PM

తిమ్మంపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ములకలపల్లి,(విజయక్రాంతి): విద్య ద్వారానే వివక్షతలను అంతం చేయవచ్చని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిరూపించారని తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు అన్నారు.మండల పరిధిలోని తిమ్మంపేట గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి మహోత్సవానికి ముఖ్య అతిథిగా తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు పాల్గొని మాట్లాడారు. పార్టీలపరంగా ఏ వ్యక్తి అధికారంలో ఉన్న అది కేవలం అంబేద్కర్ దయవలనేనని, అదేవిధంగా భారత దేశంలో ప్రతి ఒక్కరు  కులమతాలకతీతంగా అంబేద్కర్ ను స్మరించుకోవడం జయంతిని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేశారు.

అదేవిధంగా ఈరోజు మారుమూల ప్రాంతమైన తిమ్మంపేటలో డాక్టర్ విద్యనభ్యసిస్తూ, పీజీ విద్యనభ్యసిస్తూ క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించిన ఆడపిల్లలను వారి తల్లిదండ్రులను తన చేతుల మీదగా సత్కరించడం చాలా  ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శేషమఠం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యాంగం రాయడానికి అంబేద్కర్ ఆరోగ్యంగా,మానసికంగా కుటుంబ పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు.రాయల రవి భాస్కర్ మాట్లాడుతూ... నేడు సమాజంలో ఉన్న అన్ని రకాల వివక్షలు కేవలం విద్య ద్వారానే అంతం చేయగలమని తల్లిదండ్రులు వారి పిల్లల చదువుల విషయంలో ఎన్ని వ్యయ ప్రయాసలైన వెనకడకూడదు.

ఏజెన్సీలో గిరిజనులు ఎమ్మెల్యేలుగా, సర్పంచులుగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఆనాడు రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్లో అంబేద్కర్ రచించిన ట్రైబల్ అడ్వైజరి కమిషన్ వల్లనేనని గిరిజన సోదరులంతా అంబేద్కర్ కు సర్వదా కృతజ్ఞతలుగా ఉండాలని కోరారు.ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సర్పంచ్ తుర్రం  శ్రీనివాస్ ను తిమ్మంపేట అంబేద్కర్ జ్ఞాన వారసులు శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయల రవి భాస్కర్, రాయల నరేష్, రాయల సుధాకర్, నడిపింటి రాజు, రాయల నవీన్, మంద వినోద్, రాయల రాము, రాయల రాజేష్, రాయల నివాస్, కడారి మనోజ్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.