14 April, 2026 | 8:03 PM

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే

14-04-2026 03:57 PM

- CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమేనని, అలాంటి రాజ్యాంగంపై జరిగే దాడులను తిప్పి కొట్టాలని CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల IBలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం CPI జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తో కలిసి ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను పక్కనబెట్టి, దేశాన్ని విభజించే విధానాలను అమలు చేస్తోందని. రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, సెక్యులరిజం వంటి ప్రాథమిక విలువలను క్షీణింపజేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరీచే చర్యలు తీసుకుంటోందని ద్వజమెత్తారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను  దేశ పాలనలో ప్రతిబింబింపజేయడానికి ప్రయత్నించడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ విధానాలు దేశ ఏకత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగి ఉన్నాయన్నారు. విభజన, ద్వేషం, మతాధారిత రాజకీయాలు దేశ భవిష్యత్తును చీకట్లోకి నెట్టే ప్రమాదం ఉందన్నారు.